కోమటిరెడ్డికి కలిసొచ్చేనా?
కానీ ఇప్పుడు ఉన్నట్లుండి వెంకట్‌రెడ్డిని వెతుక్కుంటూ ఓ అవకాశం వచ్చింది.
By: Tupaki Desk | 25 July 2023 1:44 PM GMTవచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన.. ఈ సారి మాత్రం రాష్ట్రంలోనే ఉండాలనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నది ఆయన కోరిక.
కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ స్థానం ఖాళీగా లేని పరిస్థితి. అన్ని చోట్లా కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి వెంకట్‌రెడ్డిని వెతుక్కుంటూ ఓ అవకాశం వచ్చింది.
కాంగ్రెస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి తాజాగా పార్టీకి హ్యాండ్ ఇచ్చి.. కారెక్కారు. ఉత్తమ కూమార్ రెడ్డి అనుచరుడిగా పేరొందని అనిల్.. గత ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ అప్పుడు పైళ్ల శేఖర్ రెడ్డి (బీఆర్ఎస్) చేతిలో పరాజయం పాలయ్యారు.
అప్పటి నుంచి భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జీగానూ కొనసాగుతున్నారు. కానీ ఎప్పటి నుంచో వెంకట్‌రెడ్డితో అనిల్‌కు విభేధాలు ఉన్నాయి. కోమటిరెడ్డి తీరు పట్ల అసంతృప్తితోనే అనిల్ పార్టీని వీడినట్లు సమాచారం. గత ఎన్నికల్లో వెంకట్‌రెడ్డి అనుచరులు శేఖర్ రెడ్డికి మద్దతు ఇవ్వడంతోనే తాను ఓడిపోయానని అనిల్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అనిల్ తానంతట తానే పార్టీ మారడంతో కోమటిరెడ్డికి లైన్ క్లియర్ అయిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ఆయన ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ ఏ నియోజకవర్గమో తేల్చుకోలేకపోతున్నారు.
కానీ ఇప్పుడు అనిల్ వెళ్లిపోవడంతో భువనగిరిపై కోమటిరెడ్డి కర్చీఫ్ వేసే అవకాశం ఉంది. అయితే భువనగిరి అసెంబ్లీ టికెట్‌ను బీసీ నేతకు కేటాయించాలని ఇటీవల నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు తీర్మానించారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి టికెట్ దక్కుతుందా? అన్నది చూడాలి.