మనిషి బీఆర్ఎస్‌లో.. మనసు కాంగ్రెస్‌లో.. ఏం 'ఆత్రం' భయ్యా!
ఆసిఫాబాద్‌లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కోవా లక్ష్మి ఇప్పుడు టికెట్ రేసులో ముందున్నారనే ప్రచారం జోరుగాసాగుతోంది.
By: Tupaki Desk | 27 July 2023 2:45 AM GMTఆ నియోజకవర్గం ప్రజలు ఇదే మాట అంటున్నారు. మనిషి బీఆర్ఎస్‌లో ఉన్నారు.. మనసు మాత్రం కాంగ్రెస్‌లో ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాదు.. కొందరు ఇంత ఆత్రం ఎందుకన్నా.. ! అని సటైర్లు కూడా పేలుస్తున్నారు. ఆ కథేంటంటే.. తెలంగాణలోని కొమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ బీఆర్ఎస్ లో పొలిటికల్ మంటలు మామూలుగా లేవనే టాక్ వినిపిస్తోంది.
ఇక్కడ నుంచి గత 2018లో విజయం దక్కించుకున్న ఆత్రం సక్కు.. తర్వాత జంప్ చేశారు. కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ ఎస్‌కు జై కొట్టారు. ఇప్పటి వరకు బాగానే గడిచిపోయింది. ఎస్టీ నియోజకవర్గం అయినా.. ఆసిఫాబాద్‌లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కోవా లక్ష్మి ఇప్పుడు టికెట్ రేసులో ముందున్నారనే ప్రచారం జోరుగాసాగుతోంది. పైగా.. ఆమె కేవలం 170 ఓట్లతోనే పరాజయం పాలయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీ ఖాయమనే ధీమాతో ఉన్నారు.
ప్రస్తుతం కోవా లక్ష్మి జెడ్పీ చైర్ పర్సన్‌గా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో నువ్వా-నేనా అన్నట్టుగా రాజకీయం మారిపోయింది. పొరుగు పార్టీల నుంచి వచ్చిన వారిని నమ్మొద్దంటూ.. లక్ష్మి వర్గం ప్రచారం చేస్తోంది.
ఇక, కాంగ్రెస్‌లో గెలిచి.. బీఆర్ఎస్‌లోకి వచ్చిన తర్వాత.. ఆత్రం.. ఆ పార్టీ వారిని వదిలేశారు. అంటే తన వర్గాన్ని పట్టించుకోవడం మానేశారు. పోనీ.. అధికార పార్టీలో అయినా.. ఆయనకు గ్రిప్ ఉందా ? అంటే.. అది కూడా లేదని అంటున్నారు.
ఈ నేపథ్యానికి తోడు కోవా లక్ష్మి కూడా రేసులో ఉండడం, ఆమెకు మంత్రి కేటీఆర్ ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో టికెట్ దక్కే విషయంలో సక్కు ఆరాటపడుతున్నారు. తనకు టికెట్ దక్కడం కష్టమేనని భావిస్తున్న ఆయన మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
పైగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల తర్వాత దూకుడుగా ఉండడం, ఆసిఫాబాద్‌లో తనకు గ్రిప్ ఉండడంతో ఆత్రం.. చాలా ఆత్రంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, వారు ఊ.. అంటే చాలు.. వెళ్లిపోతారని.. కండువా మార్చేస్తారని.. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.