Begin typing your search above and press return to search.

వనమాకే కాదు..మంత్రికీ హైకోర్టు షాక్.. తర్వాతేంటో?

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు శ్రీనివాస్ గౌడ్.

By:  Tupaki Desk   |   25 July 2023 11:23 AM GMT
వనమాకే కాదు..మంత్రికీ హైకోర్టు షాక్.. తర్వాతేంటో?
X

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చిన తెలంగాణ హైకోర్టు మరో తెలంగాణ ఎమ్మెల్యే (మంత్రి) ఎన్నిక పైనా కీలక తీర్పునిచ్చింది. తదుపరి ఏం జరగనుందో ఉత్కంఠ రేపుతోంది.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘం నేతగా కీలక పాత్ర పోషించిన ఆయన రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. వెనుకబడిన ప్రాంతమైన మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి రెండుసార్లు గెలిచారు. వాస్తవానికి రాష్ట్రం ఏర్పడక ముందు బీఆర్ఎస్ కు ఉమ్మడి పాలమూరులో పెద్దగా బలం లేదు.

అయితే, తెలంగాణ వచ్చాక పరిస్థితులు మారాయి. అందులోనూ జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు సరైన అభ్యర్థి కరవయ్యారు. గతంలో ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఈ మూడు పార్టీలకు శ్రీనివాస్ గౌడ్ కు పోటీనిచ్చే నాయకుడు ఇప్పుడు అవసరం ఉంది.

రెండోసారి గెలుపు వివాదాలమయం 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి గెలిచిన శ్రీనివాస్ గౌడ్ కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. కీలకమైన ఎక్సైజన్ శాఖకు తోడు క్రీడా, పర్యటక శాఖ దక్కింది. అయితే, రెండోసారి గెలిచిన తర్వాతే అసలు సమస్య వచ్చింది. ఆయన ఎన్నికపై వివాదం రేగింది.

హై కోర్టుకు చేరిన వ్యవహారం..శ్రీనివాస్ గౌడ్ ఎన్నికను సవాల్ చేస్తూ మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు 2019లో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు, అప్పుల వివరాలు దాచిపెట్టారని ఆరోపించారు. కాగా, రాఘవేంద్రరాజు వేసిన పిటిషన్‌ను తిరస్కరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యంతరాలను పరిశీలించాలని గతంలో పిటిషన్‌ ను సుప్రీం కోర్టు.. హైకోర్టుకు పంపించింది.

మరోవైపు మంగళవారం ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. శ్రీనివాస్‌ గౌడ్‌ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి వేసిన పిటిషన్‌ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో మంత్రికి హై కోర్టులో చుక్కెదురైంది.

ఒకే రోజు రెండు తీర్పులు..అధికార పార్టీ రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసుల్లో తెలంగాణ హైకోర్టు ఒకే రోజు రెండు కీలక తీర్పులిచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పునివ్వడమే గాక.. తనపై వేసిన పిటిషన్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యంతరాలను పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి ఒకే రోజు న్యాయస్థానం రెండు షాకులిచ్చిందన్నమాట. అంతేగాక.. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును నియమించింది. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ కేసు ఏమవుతుందో చూడాలి. కాగా, రాష్ట్ర శాసన సభ పదవీ కాలం నాలుగైదు నెలలు కూడా లేదు.

శ్రీనివాస్ గౌడ్ ప్రతివాదులకు ఊరట మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారనే ఆరోపణలున్నాయి. అంతేగాక ఆయన వారిమీద కేసులు పెట్టించడం సహా వేధింపులకు పాల్పడినట్లు కథనాలు వచ్చాయి. ఆయన ప్రత్యర్థులు ఏకంగా సోషల్ మీడియాకు కూడా ఎక్కారు. మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు కోర్టు తీర్పు నేపథ్యంలో వారికి కాస్త ఊరటనే అని చెప్పొచ్చు.