బీఆర్ఎస్ రమ్మంటోంది.. కాంగ్రెస్ వద్దంటోంది
ఇక ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరింత మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
By: Tupaki Desk | 25 July 2023 11:30 PM GMTఎన్నికాల ఏడాదిలో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. చేరికలు, ప్రచారాలపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా ముచ్చటగా మూడో సారి ఎన్నికల్లో గెలిచేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చేరికలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు బీజీపీ బలహీనపడడంతో పుంజుకున్న కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది.
తాజాగా కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడంతో హస్టం పార్టీకి షాక్ తగిలింది. కానీ కాంగ్రెస్ మాత్రం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖాళీ లేదని, ఇతర పార్టీల నుంచి ఎవరిని చేర్చుకోబోమని చెబుతోంది.
భువనగిరి కాంగ్రెస్ ఇంఛార్జీ కూడా అయిన అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడంతో.. ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్‌ను కాస్త కట్టడి చేసేందుకు కేసీఆర్‌కు ఓ అవశాకం దొరికినట్లయింది. అనిల్ కుమార్‌కు ఎంపీ టికెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరింత మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ఈ విషయాన్ని బీఆర్ఎస్‌కు చెందిన ఓ ముఖ్య నేత చెప్పడం విశేషం. ఆగస్టు 13, 14 తేదీల్లో వివిధ జిల్లాలకు చెందిన ముగ్గురు కీలక నేతలు.. బీఆర్ఎస్‌లో చేరబోతున్నారని తెలిసింది. అంతే కాకుండా తాము బలహీనంగా ఉన్న మరో రెండు నియోజకవర్గాల్లోనూ వేరే పార్టీ నేతలను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ బీఆర్ఎస్ లీడర్ చెప్పారు.
మరోవైపు కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ నేతలను చేర్చుకోవడానికి సముఖంగా లేదని సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ అసమ్మతి నేతలు కాంగ్రెస్‌లో చేరాలని ప్రయత్నిస్తున్నారు.
కానీ వీళ్లను చేర్చుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆసక్తి చూపించడం లేదని ఆ పార్టీ మాజీ మంత్రి ఒకరు చెప్పడం గమనార్హం. నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్లకు ఖాళీ లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.