Begin typing your search above and press return to search.

ప్రగతిభవన్ పై ఒత్తిడి పెంచేస్తున్నారా ?

మరి ఎవరకీ అపాయిట్మెంట్లు ఇవ్వక కేసీయార్ ప్రగతిభవన్ లో ఏమి చేస్తున్నట్లో అర్ధంకావటంలేదు.

By:  Tupaki Desk   |   28 July 2023 6:56 AM GMT
ప్రగతిభవన్ పై ఒత్తిడి పెంచేస్తున్నారా ?
X

గులాబీ నేతలు బాస్ కేసీయార్ పై బాగా ఒత్తిడి పెంచేస్తున్నారట. ఒత్తిళ్ళు కూడా రెండు రకాలుగా ఉంటోంది. మొదటిదేమో టికెట్ కన్ఫర్మ్ అని అనుకున్న వాళ్ళు. రెండో రకం ఒత్తిడి ఏమిటంటే టికెట్లు కన్ఫర్మ్ చేయమని అడుగుతున్న వాళ్ళు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో పార్టీలోని ఎంఎల్ఏలతో పాటు సీనియర్ నేతలు ప్రగతిభవన్ కు క్యూ కడుతున్నారట. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నా ఇంతవరకు కేసీయార్ అధికారికంగా ఎవరికీ టికెట్లు కేటాయించలేదు.

కొంతమంది సిట్టింగులకు, సీనియర్లకు టికెట్లు గ్యారెంటీ అని అనుకుంటున్నారు. మరి టికెట్లు గ్యారెంటీ అయినా కేసీయార్ ఎందుకని ప్రకటించటంలేదు. ఇదే విషయం ఇలాంటి వాళ్ళని టెన్షన్ కు గురిచేస్తోందట.

అందుకనే తమకు ఎలాగూ టికెట్లు ఖాయమే కాబట్టి అదే విషయాన్ని ప్రకటించేస్తే తాము నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకునేందుకు వీలుంటుందని అనుకుంటున్నారు. అందుకనే కేసీయార్ తో ఇదే విషయం మాట్లాడుదామని ప్రయత్నిస్తే ఎవరికీ అపాయిట్మెంట్ దొరకటంలేదట.

ఇక రెండో రకం నేతలేమో తాము పార్టీలో కష్టపడుతున్నాం కాబట్టి తమకు టికెట్లు ఇవ్వాలని అడిగేందుకు కేసీయార్ అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి నేతలంతా ప్రగతిభవన్ చుట్టూ తిరుగుతున్నారట.

అయితే వీరిలో కూడా ఎవరికీ కేసీయార్ దర్శనభాగ్యం దొరకటంలేదని సమాచారం. మరి ఎవరకీ అపాయిట్మెంట్లు ఇవ్వక కేసీయార్ ప్రగతిభవన్ లో ఏమి చేస్తున్నట్లో అర్ధంకావటంలేదు. ఇదే సమయంలో కేటీయార్, హరీష్ రావు జిల్లాల పర్యటనలో పరోక్షంగా టికెట్లు కన్ఫర్మ్ అయినట్లు కొందరికి సంకేతాలు ఇస్తున్నారట.

దీంతో పార్టీలో అయోమయం పెరిగిపోతోంది. ఒకవైపేమో సర్వేలు చేయించుకుంటున్నానని, అందులో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మాత్రమే టికెట్లని ఒకపుడు కేసీయార్ ప్రకటించారు. ఆ సర్వేలు, ఫీడ్ బ్యాకులు ఏమయ్యాయో ఎవరికీ తెలీదు.

కానీ ఇపుడు కేటీయార్, హరీష్ రావు ఏమో పరోక్షంగా టికెట్లపై సంకేతాలు ఇచ్చేస్తున్నారు. సంకతాలు అందుకున్న వారు వెంటనే ప్రచారంలోకి దిగిపోతున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దాంతో ప్రగతిభవన్ మీద మరింతగా ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయట.