Begin typing your search above and press return to search.

సన్న బియ్యం ఎగుమతులపై బ్యాన్..తెలంగాణకు దెబ్బా?

తెలంగాణ రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఏటా 2 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని పండిస్తుంటే అందులో 60 లక్షల మెట్రిక్ టన్నులు సన్న బియ్యం.

By:  Tupaki Desk   |   24 July 2023 5:13 AM GMT
సన్న బియ్యం ఎగుమతులపై బ్యాన్..తెలంగాణకు దెబ్బా?
X

వర్షాలు సరిగా లేకపోవటం.. అకాల వర్షాలతో ఈ ఏడాది సీజన్ దెబ్బ తిన్న వేళ.. వచ్చే ఎన్నికల నాటికి దేశంలో సన్న బియ్యం ధరల్ని అదుపులో ఉంచటం కోసం కేంద్రంలోని మోడీ సర్కార్ బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ నిర్ణయం దెబ్బకు అమెరికాలో ఉన్న తెలుగు వారు కార్లు వేసుకొని సూపర్ మార్కెట్లలో భారీగా బియ్యం బ్యాగుల్ని కొనుగోలు చేయటం.. ఇదో పెద్ద హాట్ న్యూస్ గా మారటం తెలిసిందే. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ రైతులకు నష్టం జరుగుతుందా? మొత్తంగా తెలంగాణకు ఇబ్బందికరంగా మారుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఏడాదిలో రెండు దఫాలుగా తెలంగాణ రైతాంగం సన్న బియ్యాన్ని సాగు చేస్తోంది. స్థానిక అవసరాలతో పాటు.. విదేశీ ఎగుమతులకు తగ్గట్లుగా వీటిని పండిస్తున్నారు. క్వింటాలు సన్న బియ్యం రూ.2500 - రూ.3వేల మధ్య అమ్ముకుంటూ లాభాల బాట పడుతున్న పరిస్థితి.

తాజాగా ఎగుమతుల బ్యాన్ నేపథ్యంలో సన్న బియ్యం నుంచి దొడ్డు బియ్యం వైపు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. బియ్యం ఎగుమతుల్ని కట్టడి చేసే ఉద్దేశంతో కేంద్రం గత ఏడాది ఇరవై శాతం ఎక్సైజ్ డ్యూటీని విధించినప్పటికీ ఎగుమతులు ఆగలేదని చెబుతున్నారు.

సగటు కంటే దాదాపు 35 శాతం అధికంగా విదేశాలకు బియ్యం తరలి వెళ్లటమే కాదు.. దేశంలో బియ్యం ధరలు ఏడాదిలో 11.5 శాతం పెరిగాయి. దేశంలో ఏటా 12 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుంటే.. గత ఏడాది మాత్రం 11 కోట్ల మెట్రిక్ టన్నులకు తగ్గింది. దీనికి తోడు ఈ ఏడాది వర్షాలు సరైన రీతిలో లేకపోవటంతో దేశీయ అవసరాలు.. వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం కావటంతో.. బియ్యం ధరలు పెరిగితే ఆ ప్రభావం ఎన్నికల మీద ఉంటుందన్న ఉద్దేశంతో ఎగుమతుల మీద బ్యాన్ విధించారన్న వాదన వినిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఏటా 2 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని పండిస్తుంటే అందులో 60 లక్షల మెట్రిక్ టన్నులు సన్న బియ్యం. వీటిని రైతులు సొంత అవసరాలతో పాటు స్థానిక.. దేశీయ.. విదేశాలకు ఎగుమతి చేసేందుకు మిల్లర్లకు విక్రయిస్తుంటారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉత్పత్తి అవుతుంటుంది. ఇందులో 20 లక్షల మెట్రిక్ టన్నులను స్థానిక.. దేశీయ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. మరో 16 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

తెలంగాణలో పండే సన్న బియ్యాలు బాస్మతి కంటే తక్కువ దిగుబడిని ఇస్తుంటాయని చెబుతున్నారు. ఎగుమతులపై బ్యాన్ తో తెలంగాణ రైతాంగానికి తీవ్రమైన నష్టంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఎగుమతులపై బ్యాన్ కారణంగా స్థానికంగా వారికి సరైన ధర రాదని.. అదే జరిగితే వారు సన్న బియ్యాన్ని సాగు చేయటం ఆపేసి.. దొడ్డు బియ్యం వైపు మళ్లుతారని చెబుతున్నారు.

మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం తెలంగాణ రైతాంగానికి నష్టమని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కూడా వాదిస్తున్నారు. ప్రస్తుతం దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ ఉందని.. సన్న బియ్యం మీద బ్యాన్ అవసరం లేదన్నది ఆయన వాదన. మొత్తంగా చూస్తే.. బ్యాన్ కారణంగా విదేశాల్లోని మనోళ్లకు నష్టంతో పాటు.. స్థానికంగా సన్న బియ్యాన్ని పండించే రైతులకు నష్టదాయకమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.