సిఫారసు లేఖలపై టీడీపీ కీలక నిర్ణయం
ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
By: Tupaki Desk | 18 March 2025 3:00 AM ISTతెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఈ కొత్త విధానం ప్రకారం, తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన భక్తులు ఇకపై శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. అయితే వీఐపీ బ్రేక్ దర్శనాలు సోమవారం , మంగళవారం మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను బుధవారం, గురువారం రోజుల్లో మాత్రమే టీటీడీ స్వీకరించనుంది.
ఒక్కో తెలంగాణ ప్రజాప్రతినిధికి రోజుకు ఒక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతిస్తారు. ఆ లేఖపై గరిష్టంగా ఆరుగురు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు.
ఇదివరకు సోమవారం జరిగే వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల నుంచి ఆదివారం సిఫార్సు లేఖలు స్వీకరించేవారు. అయితే ఇకపై ఆదివారం నాటి దర్శనం కోసం శనివారం నాడే ఆ లేఖలను స్వీకరించనున్నట్లు టీటీడీ తెలిపింది.
తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలు, ఇతర సాధారణ భక్తుల దర్శన సమయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ మార్పులకు భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
- బీజేపీ ఎంపీ వ్యాఖ్యల అనంతరం ఊహించని పరిణామం:
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవడం లేదని కొద్ది రోజుల క్రితం తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచే తెలంగాణ ప్రజాప్రతినిధులకు దర్శనం కల్పిస్తామని టీటీడీ చెప్పిందని, కానీ ఆ హామీని అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి సెలవుల్లో తమ సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులకు దర్శనాలు , సౌకర్యాలు కల్పించాలని, లేకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ తిరుమలకు చేరుకుని టీటీడీ పాలకమండలితో తేల్చుకుంటామని రఘునందన్ రావు హెచ్చరించారు.
రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే అంటే ఈ నెల 24వ తేదీ నుంచే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనం కల్పిస్తామని టీటీడీ ప్రకటించడం గమనార్హం. ఈ నిర్ణయం వెనుక రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా ఒక కారణం కావచ్చని భావిస్తున్నారు.
మొత్తానికి టీటీడీ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులు తమ ప్రజాప్రతినిధుల సిఫార్సులతో శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభించనుంది. అయితే, టీటీడీ సూచించిన నియమ నిబంధనలను భక్తులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.