విన్నపాలు వినవలె.. వైసీపీ భూమన చిట్టా చాలానే ఉందే..!
తిరుపతికి చెందిన ముఖ్యనాయకుడ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సీఎం జగన్‌ను కలిశారు
By: Tupaki Desk | 28 July 2023 11:05 AM GMTఎన్నికలు సమీపిస్తుండడంతో నాయకుల అభ్యర్థన చిట్టాలు తెరమీదకి వస్తున్నాయి. ఒక్కొక్క నాయకుడ ఒక్కొక్క కోరికతో ఉంటే ఫర్లేదు. వాటిని ఏదో ఒకరకంగా మేనేజ్ చేసేందుకు అధిష్టానాలు కూడా రెడీగానే ఉంటున్నాయి. ఎందుకంటే.. కీలకమైన ఎన్నికల్లో విజయం దక్కించుకోవడమే ఆయా పార్టీల పరమావధి. కానీ, నాయకుల చిత్తాలు.. వారి చిట్టాలు మాత్రం కోకొల్లలుగా ఉంటున్నాయి. దీంతో పార్టీల అధినేతలకు ఇబ్బందులు తప్పడం లేదు.
తాజాగా తిరుపతికి చెందిన ముఖ్యనాయకుడ, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సీఎం జగన్‌ను కలిశారు. దాదాపు రెండు నెలలుగా ఆయన సీఎం అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారట. కానీ, ఇప్పటి వరకు సీఎం అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదు. తాజాగా సీఎం జగన్‌ను కలిసిన భూమన .. కోరికల చిట్టాను తెరమీదికి తెచ్చారట. దీనిలో ఏకంగా.. మూడు కోరికలు ఉండడం.. అవి కూడా అత్యంత కీలకమైనవి కావడం.. వాటి కోసం మరికొందరు లైన్‌లో వేచి ఉండడం వంటివి ఇప్పుడు చర్చకు దారీతీశాయి.
భూమన వారి కోరికల చిట్టా ఇదట!
1) ఎమ్మెల్యే టికెట్: వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇవ్వాలనేది భూమన ప్రధాన డిమాండ్‌గా ఉంది. ప్రస్తుతం ఈయన కుమారుడు కార్పొరేటర్‌గా ఉన్నారు. వాస్తవానికి మేయర్ పీఠాన్ని ఆశించినా.. జగన్ వ్యూహాత్మకంగా మహిళకు కేటాయించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు మారుడికి ఎమ్మెల్యే టికెట్ కోరుతున్నారు.. ప్రస్తుత ఎమ్మెల్యే భూమన.
2) టీటీడీ బోర్డు చైర్మన్: త్వరలోనే టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని ఖాళీ చేయించి.. వైవీ సుబ్బారెడ్డిని ఎంపీగా రాజ్యసభకు పంపాలని వైసీపీ వ్యూహం రెడీ చేసుకుందనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఆ చైర్మన్‌గిరీని తనకు ఇవ్వాలని భూమన కోరుతున్నారు. ఈ క్రమంలో దీనిపైనా సీఎంతో చర్చించారు.
3) తన వారికి నామినేటెడ్: తన వర్గంగా ఉన్న ఇద్దరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని భూమన కోరుతున్నారు. వారు పార్టీకి విధేయులన్నది ఆయన మాట.మరి వీటిలో జగన్ వేటికి పచ్చజెండా ఊపుతారో చూడాలి.