తిరుపతి మీద కన్నేశారా ?
దాంతో వివాదంపై పవన్ చాలా సీరియస్ గా ఉన్నారని అర్ధమైంది.
By: Tupaki Desk | 18 July 2023 6:37 AM GMTవారాహియాత్ర సందర్భంగా తణుకు పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏదేదో ప్రకటించేసి చివరకు ఇంకేదో చేశారు. సోమవారం తిరుపతికి చేరుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలను తిరుపతికి పిలిపించుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టు నుండి తిరుపతి టౌన్ క్లబ్ వరకు చాలా పెద్ద ర్యాలీ నిర్వహించారు.
అసలు పవన్ సడెన్ గా తిరుపతికి ఎందుకెళ్ళారు ? ఎందుకంటే శ్రీకాళహస్తిలో ఆందోళన చేస్తున్న నేపధ్యంలో కొట్టే సాయి అనే నేతను సీఐ అంజూయాదవ్ చెంపదెబ్బ కొట్టారు. అదికాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది.
దాని పై పవన్ చాలా తీవ్రంగా స్పందించారు. తాను పర్సనల్ గా శ్రీకాళహస్తికి వెళ్ళి సీఐ విషయం ఏమిటో తేల్చుకుంటామని ప్రకటించారు. దాంతో వివాదంపై పవన్ చాలా సీరియస్ గా ఉన్నారని అర్ధమైంది.
అందుకే సీఐ కథేంటో తేల్చేసే ఉద్దేశ్యంతోనే పవన్ సోమవారం ఉదయం తిరుపతికి చేరుకున్నారు. ముందుగా చెప్పినట్లు శ్రీకాళహస్తి కి వెళ్ళకుండా తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి విజ్ఞాపన పత్రం అందించి తిరిగి వెళ్ళిపోయారు.
ఈ విషయం గమనించిన తర్వాత అందరిలోను ఒక అనుమానం పెరిగిపోయింది. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో పవన్ తిరుపతి నుంచి పోటీచేయబోతున్నారా ? అని. ఎందుకంటే చెంపదెబ్బ ఘటన జరిగింది శ్రీకాళహస్తిలో అయితే పవన్ ర్యాలీ నిర్వహించింది తిరుపతిలో.
పవన్ రాక సందర్భంగా టౌన్ క్లబ్ ప్రాంతమంతా అభిమానులతో నిండిపోయింది. పవన్ను ఉద్దేశించి అభిమానులు సీఎం సీఎం అంటూ నానా గోలచేశారు. గతంలోనే పవన్ను ఇక్కడినుండి పోటీచేయమని తిరుపతి పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. బహుశా దాన్ని గుర్తుపెట్టుకుని పవన్ తిరుపతిలో భారీ ర్యాలీ చేశారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఒకపుడు ఇక్కడి నుండే మెగాస్టార్ చిరంజీవి గెలిచుండటం, ఇక్కడ బలిజల ఓట్లు బాగా ఎక్కువగా ఉండటం కూడా పవన్ ఆలోచించారనటానికి కారణాలుగా ఉన్నాయి. మరి చివరకు పవన్ ఏమిచేస్తారో చూడాలి.