Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'జైలర్'

పదేళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. అటు తమిళంలో.. ఇటు తెలుగులో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్.. మార్కెట్ దెబ్బ తిన్నాయి. చివరి చిత్రం ‘అన్నాత్తె’ (పెద్దన్న)తో తీవ్రంగా నిరాశపరిచిన సూపర్ స్టార్.. ఇప్పుడు ‘జైలర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

By:  Tupaki Desk   |   10 Aug 2023 7:25 AM GMT
మూవీ రివ్యూ : జైలర్
X

మూవీ రివ్యూ : 'జైలర్'

నటీనటులు: రజినీకాంత్-రమ్యకృష్ణ-వినాయకన్-వసంత్ రవి-వీటీవీ గణేష్-యోగిబాబు-మోహన్ లాల్-సునీల్-శివరాజ్ కుమార్-తమన్నా తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్ కన్నన్

నిర్మాత: కళానిధి మారన్

రచన-దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్

పదేళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. అటు తమిళంలో.. ఇటు తెలుగులో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్.. మార్కెట్ దెబ్బ తిన్నాయి. చివరి చిత్రం ‘అన్నాత్తె’ (పెద్దన్న)తో తీవ్రంగా నిరాశపరిచిన సూపర్ స్టార్.. ఇప్పుడు ‘జైలర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రోమోలు.. పాటలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. మరి ‘జైలర్’.. సూపర్ స్టార్ ఈజ్ బ్యాక్ అనిపించేలా ఉందా? చూద్దాం పదండి.


కథ:


ముత్తు (రజినీకాంత్) రిటైరైన పోలీస్ అధికారి. ఆయన కొడుకు అర్జున్ (వసంత్ రవి) తండ్రి బాటలో పోలీస్ అవుతాడు. అతను ఒక విగ్రహాల రాకెట్ ను ఛేదించే క్రమంలో పెద్ద మాఫియాతో పెట్టుకుని కనిపించకుండా పోతాడు. అర్జున్ చనిపోయాడన్న సమాచారంతో హతాశుడైన ముత్తు.. అతడి చావుకు కారణమైన వారిలో ఒక్కక్కరిని మట్టుబెట్టడం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే ముత్తు ఎంత పవర్ ఫుల్ అనే విషయం అందరికీ తెలుస్తుంది. ఐతే విగ్రహాల మాఫియా ముత్తుకు భయపడి.. అర్జున్ చనిపోలేదని.. తమ దగ్గరే బందీగా ఉన్నాడని వెల్లడిస్తుంది. అతను ప్రాణాలతో బయటికి రాావాలంటే అత్యంత విలువైన ఒక కిరీటాన్ని తెచ్చి తమకు ఇవ్వాలని ముత్తుకు కండిషన్ పెడుతుంది. ఈ స్థితిలో ముత్తు ఏం చేశాడు.. కొడుకును ఎలా కాపాడుకున్నాడు.. చివరికి ఏమైంది అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ:


సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఒక అసాధారణమైన హీరోయిక్ ఇమేజ్ ఉన్న హీరో. ఆ ఇమేజ్ ను సరిగ్గా వాడుకుని.. ఆయన పాత్ర ఎలివేట్ అయ్యేలా చూసుకుంటే.. కథాకథనాల్లో కూడా కొంచెం బలం ఉంటే.. థియేటర్లు హోరెత్తిపోతాయి. కానీ చాలా ఏళ్ల నుంచి ఆయన్ని సరిగ్గా వాడుకుంటున్న దర్శకుడే కనిపించడం లేదు. కబాలి.. కాలా సినిమాల్లో రజినీ ఇమేజ్ కు సూటవ్వని కథల్లో ఆయన్ని చూపించే ప్రయత్నం బెడిసికొట్టగా.. ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లో రజినీని స్టైలుగా చూపించి.. ఫ్యాన్ మూమెంట్స్ పెట్టారే తప్ప కథల్లో పెద్దగా విషయం లేకపోయింది. రజినీని మామూలుగా చూపించినా కష్టం. అలా అని ఆయన పాత్రను విపరీతంగా ఎలివేట్ చేసి.. కథల్లో విషయం లేకున్నా ఇబ్బందే. ఇలాంటి సమయంలో నెల్సన్ దిలీప్ కుమార్.. కొంతమేర ఈ రెండు విషయాలనూ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశాడు. రజినీ గత సినిమాలతో పోలిస్తే ఆయన ఇమేజ్ ను నెల్సన్ బాగానే వాడుకున్నాడు. ఒక దశ వరకు రజినీ నుంచి అభిమానులు కోరుకునే మూమెంట్స్.. దానికి తోడు నెల్సన్ మార్కు కామెడీతో ‘జైలర్’ బండి సాఫీగానే సాగిపోతుంది. కానీ కొంచెం కథ చెప్పాల్సి వచ్చాకే నెల్సన్ తడబడ్డాడు. ఇటు రజినీ పాత్రను ఎలివేట్ చేయలేక.. అటు తన మార్కు కామెడీనీ పండించలేక గాడి తప్పాడు. రజినీ గత సినిమాలతో పోలిస్తే ‘జైలర్’ బెటరే కానీ.. ఇది కూడా పూర్తి సంతృప్తినిచ్చే సినిమా అయితే కాదు.

రజినీకాంత్ వయసిప్పుడు 72 ఏళ్లు. ఈ వయసులో కూడా ఆయన్ని నవ యువకుడిలా చూపిస్తే.. ఆయన వీర లెవెల్లో ఫైట్లు చేస్తే.. ఒక్క దెబ్బకు వంద మందిని కొట్టి అవతల పడేస్తే.. చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. సూపర్ స్టార్ నుంచి అభిమానులు ప్రధానంగా ఆశించేది హీరోయిక్ ఎలివేషన్లే అయినప్పటికీ.. పైన చెప్పినట్లు నేల విడిచి సాము చేస్తే చూడ్డానికి అంత బాగోదు. ఐతే నెల్సన్ ‘జైలర్’లో ఎలివేషన్ సీన్లు చాలానే పెట్టాడు కానీ.. అవి ఎబ్బెట్టుగా లేకుండా చూసుకోవడం విశేషం. రజినీ రంగంలోకి దిగి నేరుగా ఫైట్లు చేసి.. రౌడీలను చితగ్గొట్టేస్తున్నట్లు కాకుండా ఆయన్ని అలా కూర్చోబెట్టి.. నిల్చోబెట్టి.. ఇవ్వాల్సిన ఎలివేషన్ ఇచ్చేశాడు. ఈ వయసులోనూ రజినీని సూపర్ స్టైలిష్ గా చూపించాడు. చిన్న స్మైల్.. చిన్న లుక్ తోనే రజినీ అభిమానులను కట్టి పడేశాడు. పైకి హీరో మామూలుగా కనిపిస్తుంటాడు.. కానీ అతడిలో ఇంకో కోణం ఉంటుంది.. అది బయటికి వచ్చినపుడు అవతలి వాళ్లు తట్టుకోలేరు.. ఇది సౌత్ ఇండియన్ సినిమాల్లో దశాబ్దాలుగా సూపర్ హిట్ ‘ఎలివేషన్’ ఫార్ములా. దీనికి మూలం మూడు దశాబ్దాల కిందటి రజినీ సినిమా ‘బాషా’. ఇప్పుడు ‘జైలర్’లో సైతం నెల్సన్ అదే ఫార్ములాను అప్లై చేసి రజినీ పాత్రను ఎలివేట్ చేయడానికి.. అభిమానులను ఉర్రూతలూగించడానికి ప్రయత్నించాడు. చాలా వరకు ఇలాంటి మూమెంట్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. రజినీ ఎక్కువ హడావుడి చేయకుండా.. నెల్సన్ శైలికి తగ్గట్లు సటిల్ గా యాక్ట్ చేస్తూ తన పాత్రను పండించే ప్రయత్నం చేశాడు.

కొంచెం నెమ్మదిగా మొదలయ్యే ‘జైలర్’.. రజినీ పాత్రలో రెండో కోణం మొదలయ్యాకే ఊపందుకుంటుంది. నెల్సన్ గత చిత్రాల్లో మంచి వినోదం పండించిన యోగిబాబు.. వీటీవీ గణేష్ ‘జైలర్’కు కూడా బాగానే తోడ్పాటు అందించారు. ఓవైపు రజినీ మార్కు ఎలివేషన్స్.. ఇంకోవైపు నెల్సన్ శైలి కామెడీతో ఫస్టాఫ్ వేగంగా సాగిపోతుంది. సగటు కమర్షియల్ సినిమా నుంచి ఆశించే వినోదంతో ‘జైలర్ ప్రథమార్ధం పైసా వసూల్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు బోరింగ్ మూమెంట్స్ అంటూ పెద్దగా లేవు. ఎక్కడైనా కొంచెం ఊపు తగ్గిందనిపించినా.. రజినీ చరిష్మాకు అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తోడై ‘జైలర్’ను ముందుకు తీసుకెళ్లాయి. సినిమాకు జైలర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు.. అసలీ ముత్తువేల్ పాండ్యన్ (రజినీ పాత్ర పేరు) అనేది చూపిస్తూ సెకండాఫ్ లో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టారు. అందులో యంగ్ లుక్ లో రజినీని చూసి మెస్మరైజ్ అవ్వాల్సిందే. ఆయన మేకప్.. స్టైలింగ్ అంత బాగా కుదిరాయి. తక్కువ నిడివిలోనే ముత్తువేల్ ఎంత పవర్ ఫుల్లో చూపించారు. ఐతే ఇక్కడిదాకా ‘జైలర్’ బండి సాఫీగానే నడిచింది కానీ.. ఆ తర్వాత మాత్రం పట్టు సడలింది.

హీరో ఏకపక్షంగా అనుకున్నదంతా చేసుకుపోతుంటే.. ఇంక కిక్కేముంటుంది? విలన్ కూడా పవర్ ఫుల్ గా ఉండి.. పెద్ద సవాల్ విసిరితే.. దాన్ని హీరో అధిగమిస్తేనే కదా మజా. ఇక్కడే ‘జైలర్’ తేడా కొట్టేసింది. హీరో ముందు విలన్ బలహీనంగా అనిపిస్తాడే తప్ప.. అతణ్ని ఛాలెంజ్ చేసేలా కనిపించడు. హీరోను అంత పవర్ ఫుల్ గా చూపించాక అతడికిచ్చిన టాస్క్ చిన్నదిగా అనిపిస్తుంది. ఒక కిరీటం చుట్టూ నడిపిన కథ పూర్తిగా తేడా కొట్టేసింది. ఇంత పెద్ద సినిమాలో ఆ కిరీటం కథ చిన్నదిగా అనిపిస్తుంది. సునీల్.. తమన్నాల చుట్టూ నడిపిన ‘షూటింగ్-లవ్’ ట్రాక్ తేలిపోయింది. కొంతసేపు రజినీ కూడా సైడ్ అయిపోవడంతో ‘జైలర్’ బాగా బోర్ కొట్టించేస్తుంది. నెల్సన్ మార్కు కామెడీ కూడా వర్కవుట్ కాలేదు. క్యామియో రోల్ లో మోహన్ లాల్ వచ్చినా చలనం కనిపించదు. ఒక 40 నిమిషాలు ‘జైలర్’ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. మళ్లీ ప్రి క్లైమాక్సులో రజినీ పైకి ఫోకస్ షిఫ్ట్ అయ్యాక కానీ ఊపు రాదు. పతాక సన్నివేశాల్లో మళ్లీ ఎలివేషన్లు వర్కవుట్ అయ్యాయి. రజినీ క్లైమాక్సులో మెస్మరైజ్ చేశాడు. కేవలం రజినీని చూసి మురిపిపోతామంటే.. ఆయన మార్కు ఎలివేషన్లు చాలనుకుంటే ‘జైలర్’ చూసేయొచ్చు. కానీ అంతకుమించి మరీ ఎక్కువ ఆశించలేం.


నటీనటులు:


రజినీలో వేగం తగ్గింది.. ఆయనపై వయసు ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయినా సరే ఉన్నంతలో బెస్ట్ లుక్ లో కనిపించారు. తన చరిష్మాతో అభిమానులను మెస్మరైజ్ చేస్తూనే సగటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ఆయనది వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. రజినీ స్టైల్.. ఆయన మార్కు ఎలివేషన్లకు కనెక్ట్ అయితే ‘జైలర్’ చాలా వరకు ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. రజినీ తన వయసుకు తగ్గ పాత్రలలోనే కనిపించారిందులో. పాత్రల ప్రాధాన్యం.. పెర్ఫామెన్స్ పరంగా మిగతా వాళ్లందరూ సోసోగానే అనిపిస్తారు. విలన్ పాత్రలో వినాయకన్ మెరిశాడు. ఐతే ఆ పాత్రను ముందే కామెడీగా మార్చేయడంతో రజినీకి దీటైన విలన్ లాగా అనిపించడు. రమ్యకృష్ణ పాత్రకు ప్రాధాన్యం తక్కువే. ఆమె నటన ఓకే. రజినీ కొడుకు పాత్రలో వసంత్ రవి పర్వాలేదు. యోగిబాబు.. వీటీవీ గణేష్ కొంత మేర నవ్వించారు. వాళ్లను పూర్తిగా వాడుకోలేదు. శివరాజ్ కుమార్.. మోహన్ లాల్.. తమన్నా.. సునీల్.. వీళ్లందరివీ అతిథి పాత్రలే. వాళ్ల వాళ్ల పరిధిలో బాగానే చేశారు.


సాంకేతిక వర్గం:


సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ లేకుంటే ‘జైలర్’ చాలా బలహీనంగా అనిపించేదేమో. రజినీ మీద తన అభిమానాన్నంతా చూపిస్తూ.. ఆయన పాత్రను ఎలివేట్ చేస్తూ అనిరుధ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు అతి పెద్ద బలం. ఏమీ లేని చోట కూడా ఏదో జరిగిపోతున్నట్లు అతడి ఆర్ఆర్ ప్రేక్షకులకు భ్రమలు కలిగిస్తుంది. హుకుం.. కావాలయ్యా పాటలు కూడా హుషారు పుట్టిస్తాయి. ‘కావాలయ్యా’ వచ్చిన సందర్భం అంత బాగా లేదు కానీ.. ఆ పాట మాత్రం అలరిస్తుంది. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం కలర్ ఫుల్ గా సాగింది. నిర్మాణ విలువలు సన్ పిక్చర్స్ స్థాయికి తగ్గట్లు గ్రాండ్ గా ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. ‘బీస్ట్’ తర్వాత బెటర్ ఔట్ పుట్ ఇచ్చాడు కానీ.. తన తొలి రెండు చిత్రాల స్థాయిలో మాత్రం రైటింగ్ దగ్గర పనితనం చూపించలేకపోయాడు. కథ పరంగా రొటీన్ అనిపిస్తుంది ‘జైలర్’. కథనంలో బిగి లేదు. రజినీ చరిష్మాను అతను బాగా వాడుకున్నాడు. అభిమానులు కోరుకున్న విధంగా సూపర్ స్టార్ ను ప్రెజెంట్ చేశాడు. కొన్ని చోట్ల కామెడీ పండించాడు. అంతకుమించి దర్శకుడిగా గొప్ప పనితనం అయితే చూపించలేదు.


చివరగా: జైలర్.. రజినీ పీక్స్.. స్టోరీ వీక్


రేటింగ్ - 2.5/5