మోడీ చుట్టూ ముళ్లు.. అయినా మౌనం వీడని విశ్వగురు!
ప్రధాని నరేంద్ర మోడీ.. విశ్వగురువుగా ప్రఖ్యాతి చెందిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 16 July 2023 8:38 AM GMTప్రధాని నరేంద్ర మోడీ.. విశ్వగురువుగా ప్రఖ్యాతి చెందిన విషయం తెలిసిందే. ముందు దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపాలని ప్రయత్నించి.. ఇప్పుడు తానే విశ్వగురుగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు ఆయన ఎంత కాదన్నా..ఔనన్నా.. కళ్లముందు కీలక సమస్యలు ముళ్ల మాదిరిగా గుచ్చుకుంటున్నాయి. వీటిలో గత 70 రోజులుగా అట్టుడుకుతున్న .. మరో మాటలో చెప్పాలంటే.. రావణ కాష్ఠంగా కాలుతున్న మణిపూర్ వివాదం ఉంది.
ఇక్కడి గిరిజన తెగల మధ్య ఏర్పడ్డ రాజకీయ దుమారం ఇంతింతై.. అన్నట్టుగా రగులుతూనే ఉంది. అయి తే.. మధ్యలో ఒకసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని సర్దిచెప్పినా.. బలగాల దుందుడు కుతో.. మళ్లీ రాజుకుంది. ఇప్పుడు ఇక్కడ జనాలు చాలా వరకు వలస పోయారు. రోడ్లు నిట్టూరుస్తూ.. వచ్చిపోయే సైనిక వాహనాలతో నిండిపోయాయి. మరోవైపు ఇంటర్నెట్ లేదు. టీవీలు లేవు, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కూడా కట్ చేసి రెండు మాసాలైంది.
ఇక, దీనికి తోడు.. ఇప్పుడు మరో వివాదం.. ఢిల్లీ నగరం వరదలతో మునిగిపోయింది. ఎటు చూసినా నీరే. చివరకు ముఖ్యమం త్రి కార్యాలయం నుంచి రాజ్‌భవన్ వరకు.. అంతా మునిగిపోయింది. ఇక, ప్రతిష్టాత్మక ఎర్రకోట, మహాత్మా గాంధీ సమాధి(రాజ్‌ఘాట్)లు కూడా.. వరద ముంపుల్లో కూరుకుపోయాయి. ప్రధాన కార్యాలయన్నీ వరద నీటి కారణంగా ముతబడ్డాయి. మరోవైపుపాఠశాలలకు సెలవులు ఇచ్చారు.
అయితే.. ఇంత జరుగుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అటు మణిపూర్ విషయంపై కానీ.. ఇటు ఢిల్లీ వరదలపై కానీ.. ఎక్కడా స్పందించడం లేదు. చిత్రం ఏంటంటే భారత మీడియాకు ఇవన్నీ ఈ కోణంలో కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ సహా ప్రపంచ మీడియా పెద్ద పెద్ద ఫొటోలతో ఇటు మణిపూర్, అటు ఢిల్లీ అంశాలను చూపిస్తూ.. మోడీని ఏకేస్తుండడం గమనార్హం. నీరో చక్రవర్తి కథను పాకిస్థాన్ పత్రికలు తెరమీదికి తెచ్చాయి. కానీ, ఎవరు ఏమనుకున్నా.. ఇప్పుడు మోడీకి వీటికన్నా.. ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఒక్కటే కనిపిస్తుండడం గమనార్హం..