'మిథునం' రచయిత కన్నుమూత
నవ్య వార పత్రిక కు సుదీర్ఘ కాలం పాటు ఎడిటర్ గా
By: Tupaki Desk | 19 July 2023 5:03 AM GMTఎస్పీ బాలసుబ్రమణ్యం.. లక్ష్మీ ప్రధాన పాత్రలో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మిథునం' సినిమా కు కథను అందించిన శ్రీ రమణ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో నేడు తెల్లవారుజామున చనిపోయినట్టు కుటుంబ సభ్యులు దృవీకరించారు.
బాపు.. రమణ తో కలిసి సుదీర్ఘ కాలంగా పని చేసి పేరడి రచనలకు ప్రసిద్దిగాంచిన శ్రీ రమణ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వేమూరు మండలం అగ్రహారంలో జన్మించారు. బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ పూర్తి చేసిన శ్రీ రమణ పలు పత్రికల్లో శీర్షికలు రాయడం ద్వారా రచయితగా మంచి పేరు సొంతం చేసుకున్నారు.
నవ్య వార పత్రిక కు సుదీర్ఘ కాలం పాటు ఎడిటర్ గా శ్రీ రమణ విధులు నిర్వర్తించారు. బాపు రమణలు చేసిన పలు ప్రాజెక్ట్ ల్లో భాగస్వామ్యం అవ్వడంతో పాటు ఇంకా పలు సినిమాలు.. ఇతర కథల్లో తన వంతు భాగస్వామ్యంగా ఉన్నారు.
మిథునం వంటి ఒక అద్భుతమైన కథను అందించిన శ్రీ రమణ గారు ఇక లేరు అనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలియజేస్తున్నారు.