భారీగా పెంచేసిన అగ్రరాజ్య వీసా ఫీజు.. ఎప్పటినుంచి అమలంటే?
ఉద్యోగాల కోసం జారీ చేసే హెచ్ 1బీతో సహా కొన్ని కేటగిరిల అప్లికేషన్ ఫీజుల్ని భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
By: Tupaki Desk | 2 Feb 2024 4:23 AM GMTఅగ్రరాజ్యం అమెరికా వీసా ఫీజుల్ని భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పలు వీసా దరఖాస్తుల ధరల్ని పెంచేస్తూ బైడెన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో.. అమెరికాకు వెళ్లాలనుకునే వారికి వీసా ఫీజుతోనే మోత మోగనుంది. ఉపాధి. ఉద్యోగాల కోసం జారీ చేసే హెచ్ 1బీతో సహా కొన్ని కేటగిరిల అప్లికేషన్ ఫీజుల్ని భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ధరల పెంపును బైడెన్ సర్కారు సమర్థించుకుంది. 2016 తర్వాత వీసా ఫీజుల్ని ఇంత భారీగా పెంచటం ఇదేనని పేర్కొంది. దీంతో.. అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయులందరికి చేదువార్తగానే చెప్పాలి.
పెంచిన దరఖాస్తు ఫీజులు ఎంత భారీగా ఉన్నాయన్న విషయానికి వస్తే.. హెచ్1బీ వీసా అప్లికేషన్ ఫీజు ఇప్పటివరకు 460 డాలర్లు ఉండగా.. ఏప్రిల్ ఒకటి తర్వాత నుంచి 780 డాలర్లకు పెరగనుంది. హెచ్ 1బీ రిజిస్ట్రేషన్ ధరను సైతం 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచేశారు. అయితే.. ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఎల్ 1బీ వీసా దరఖాస్తు రుసుము ఇప్పటివరకు 460 డాలర్లుగా ఉండేది. దాన్ని ఏకంగా దాదాపు మూడు రెట్లు పెంచేశారు. రానున్న రోజుల్లో 1385 డాలర్లకు పెరిగింది.
1990లో ప్రారంభించిన ఈబీ5 వీసా అప్లికేషన్ ఫీజును అయితే మరింత భారీగా పెరిగింది. ఈ అప్లికేషన్ ఫీజు ఇప్పపుడు 3675 డాలర్లు ఉండగా.. దాన్ని 11,160 డాలర్లకు పెంచేస్తున్నట్లుగా తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో వెల్లడించారు. అమెరికన్ స్థానికులకు కనీసం పది మందికి ఉద్యోగాలు కల్పించేలా.. కనిష్ఠంగా 5 లక్షల డాలర్ల పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ వీసాల్ని జారీ చేస్తారు. మొత్తంగా చూస్తే.. పెంచేసిన వీసా ఫీజు ధరలు పగలే కళ్ల ముందు చుక్కలు కనిపించేలా ఉన్నాయని చెప్పక తప్పదు.