ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం... 125 సీట్లకు 125 గెలిచిన ప్రధాని!
దగ్గరగా నలభై ఏళ్ల హున్ సెన్ పాలన
By: Tupaki Desk | 21 July 2023 8:48 AM GMTఅది ప్రజాస్వామ్య దేశమే. అక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయి. కాకపోతే గత నలభై ఏళ్లుగా ఒక్కరే ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలో గతంలో జరిగిన ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశారు. వైనాట్ 125 అన్నారు.. సాధించారు! ఇప్పుడు మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఆ కథాకమీషేమిటో ఇప్పుడు చూద్దాం...!
అవును... కంబోడియా దేశంలో గత 40 ఏళ్లుగా ప్రధానమంత్రిగా ఒకేవ్యక్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనే... హున్ సెన్! ఈయన మరోసారి ఎన్నికలకు సిద్ధమయ్యారు. సరైన ప్రతిపక్షమే లేని దేశంలో కంబోడియన్ పీపుల్స్ పార్టీ అధినేత హున్ సెన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తోంది.
ఈ ఆదివారం జులై 23న కంబోడియాలో మరోసారి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఆ దేశ ప్రధానిగా ఉన్న హున్ సెన్ మళ్ళీ గెలవాలని అనుకుంటున్నారట. మరోసారి గెలిచి ఆ పీఠాన్ని అధిష్టించి అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన ప్రధానిగా రికార్డు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారట.
దానికి కారణం.. అక్కడ సరైన ప్రతిపక్షమే లేదంట. ఒకవేళ ఉన్న ప్రతిపక్షం ఏదైనా బలపడే పరిస్థితి కనిపిస్తే... ఇక ఆ పార్టీ కనిపించదని చెబుతుంటారంట. దీంతో పైకి ప్రజాస్వామ్యం, ఎన్నికలు అని చెప్పుకున్నా... ఇది పూర్తిగా నియంత పాలన టైపే అని స్థానికులు చెబుతుంటారని అంటుంటారు.
నియంత ఖైమర్ రూజ్ తర్వాత కంబోడియా ప్రధానిగా 1985లో బాధ్యతలు చేపట్టిన హున్ సెన్ అప్పటి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. 2013లో ప్రతిపక్షాల నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనా 2018లో మాత్రం పూర్తిగా వారి ప్రభావం కనుమరుగైంది. ఫలితంగా... 2018లో జరిగిన గత ఎన్నికల్లో హున్ సెన్ మొత్తం 125 పార్లమెంటు సీట్లకు గాను 125 సీట్లను గెలుచుకున్నారు.
దగ్గరగా నలభై ఏళ్ల హున్ సెన్ పాలనలో కంబోడియా అత్యంత వెనుకబడిన ప్రపంచ దేశాల్లో ఒకటిగా మిగిలింది. 1990లో ప్రజాస్వామ్య హోదా దక్కించుకున్న కంబోడియాలో ఈ సారైనా ప్రతిపక్షంలో ఎవరో ఒకరు కూర్చుంటారా.. లేక ప్రజాస్వామ్య ముసుగులో కంబోడియా ప్రజలు నియంత మార్కు పాలనలోనే మగ్గుతారా అనేది వేచి చూడాలి!
కాగా... కాంబోడియా దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 25 ప్రాంతాలుగా విభజించారు. అలాగే దేశంలో 159 జిల్లాలు, 26 పురపాలక నగరాలు ఉన్నాయి.