Begin typing your search above and press return to search.

అతిధులను రావొద్దంటున్న యూరోప్.. ఎందుకిలా?

చాలా నగరాల్లో స్థానికులు పరాయి దేశస్తుల మాదిరి మారిపోతున్న వైనాలు ఎక్కువ కావటంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి

By:  Tupaki Desk   |   29 Aug 2023 4:51 AM GMT
అతిధులను రావొద్దంటున్న యూరోప్.. ఎందుకిలా?
X

ప్రపంచ ప్రజలకు అత్యంత అనువైన పర్యాటక దేశాల మొదటి వరుసలో నిలుస్తుంది యూరోప్. చిన్న చిన్న దేశాల సమూహంగా పిలిచే యూరోప్ కు వెళ్లేందుకు టూరిస్టులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. సంపన్న దేశాలుగా ఉండటంతో పాటు.. పర్యాటక ప్రాంతాలుగా ఉన్న ఈ దేశాల్లోని నగరాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. దీంతో.. ఇప్పటివరకు రెడ్ కార్పెట్ పరిచి.. రారమ్మంటున్న దేశాలే.. ఇప్పుడు ఆంక్షల కత్తిని బయటకు తీస్తున్నాయి. పర్యాటకంతో కాసుల వర్షం కురుస్తున్నా.. విపరీతంగా పెరిగిపోయిన టూరిస్టుల కారణంగా పెద్ద ఎత్తున సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అందుకే.. ఆంక్షల మీద ఆంక్షలు విధిస్తూ.. రావద్దన్న సందేశాన్ని.. సంకేతాన్ని ఇస్తున్న తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

నెదర్లాండ్స్ లోని ప్రధాన పట్టణమైన ఆమ్ స్టర్ డామ్ జనాభా 8.5 లక్షలు అయితే.. ఆ ప్రాంతానికి ఏడాది వ్యవధిలో వచ్చే పర్యాటకుల సంఖ్య అక్షరాల 2.5 కోట్లు. స్పెయిన్ లోని బార్సిలోనా జనాభా 16 లక్షలు అయితే.. అక్కడకు ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్య మూడు కోట్లు. ఇటలీలోని ఫ్లోరెన్స్ నగర జనాభా 3.8 లక్షలు అయితే.. ఇక్కడకు వచ్చే టూరిస్టుల సంఖ్య 2 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే యూరోప్ దేశాల్లోని నగరాలకు వస్తున్న టూరిస్టుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగటంతో.. ఆయా దేశాల్లోని స్థానికులు తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

చాలా నగరాల్లో స్థానికులు పరాయి దేశస్తుల మాదిరి మారిపోతున్న వైనాలు ఎక్కువ కావటంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దీంతో.. ఆయా దేశాలు ఇప్పుడు వెల్లువలా వచ్చి పడుతున్న టూరిస్టులకు సరికొత్త ఆంక్షలు విధిస్తూ.. తమ దేశానికి రావొద్దన్న విషయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారంటున్నారు. యూరోప్ లోని కొన్ని దేశాల్లో విచ్చలవిడి సెక్సును అనుమతించే ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారిందంటున్నారు. అందుకే.. టూరిస్టులకు వెల్ కం చెబుతున్నట్లుగా చేస్తునే.. వారిపై పలు పేర్లతో భారీగా వడ్డించేస్తున్న వైనాలు ఈ మధ్యన ఎక్కువ అయ్యాయి.

ఇదంతా చూస్తే.. టూరిస్టులకు చెక్ పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలుగా చెబుతున్నారు. విదేశీ టూరిస్టుల మీద బ్యాన్ పెట్టటం సాధ్యం కాకపోవటంతో.. వారి సంఖ్యను తగ్గించటానికి ప్రవేశ రుసుమును భారీగా పెంచేయటం.. పాతకాలం నాటి చర్చిలను.. బీచ్ ల్లో పర్యటించే వారిపైనా భారీ ఎత్తున పన్ను బాదుడును బాదేస్తున్నారు. వెనీస్ పట్టనానికి వచ్చే వారికి మొన్నటి వరకు ఉన్న మూడు యూరోల స్థానే ఇప్పుడు పది యూరోలు వసూలు చేస్తున్నారు. గ్రీస్ లోని ఆక్రోపోలిస్ ను చూసేందుకు వచ్చే వారి సంఖ్యను రోజుకు 20వేలకు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

టూరిస్టులను భారీగా తీసుకొచ్చే నౌకల్ని నెదర్లాండ్స్ బ్యాన్ చేసింది. వెసిన్ లోని ఎరాక్లియా బీచ్ లో ఇసుక గూళ్లు కడితే.. 250 యూరోల ఫైన్ వేస్తున్నారు. పోర్చుగల్ లోని బీచ్ లలో బంతులతో ఆడటంపై బ్యాన్ విదించటమే కాదు.. బీచ్ లో మ్యూజిక్ ప్లే చేస్తే 200 యూరోల నుంచి 36వేల యూరోల వరకు ఫైన్ వడ్డించేందుకు వెనుకాడటం లేదు.క్రోయేషియాలో బ్యాగులతో టూరిస్టులు తిరటాన్ని బ్యాన్ చేవారు. ఎక్కడ పడితే అక్కడ తాగటంపైనా పరిమితులు విధిస్తూ.. అలా చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. జైల్లో వేయటానికి వెనుకాడమన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిమితులతో యూరోప్ తమ దేశాలకు వచ్చే పర్యాటకుల్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది.