Begin typing your search above and press return to search.

కుతకుతలాడుతున్న ఇరాన్...66 డిగ్రీలకు చేరిన వేడి!

భూగోళం వేడెక్కుతుంది

By:  Tupaki Desk   |   18 July 2023 4:00 AM GMT
కుతకుతలాడుతున్న ఇరాన్...66 డిగ్రీలకు చేరిన వేడి!
X

భూగోళం వేడెక్కుతుంది.. కాలుష్యం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. భూతాపం పెరిగితే జీవి మనుగడకు ప్రమాదం అని పర్యావరణవేత్తలు ఎంత చెబుతున్నా వినేవారు అతితక్కువ అనేది తెలిసిన విషయమే. ఇప్పటికే వేడివల్ల దృవాల వద్ద మంచు కరుగుతుందని కూడా చెబుతున్నారు. ఈ సమయంలో ఇరాన్ లో రికార్డ్ స్థాయిలో టెంపరేచర్ నమోదైందని తెలుస్తుంది.

అవును... పెరుగుతున్న కాలుష్యం, రోజు రోజుకీ అంతరించిపోతున్న అటవీ సంపద మొదలైన కారణాలతో భూతాపం పెరుగుతుందనే హెచ్చరికలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈసమయంలో తాజాగా ఇరాన్‌ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉష్ణ సూచిక పై రికార్డు స్థాయి ఉష్ణోగ్రత కనిపించిందని తెలుస్తుంది. అధిక ఉష్ణోగ్రతకు వాతావరణంలో ఉన్న తేమ తోడు కావడంతో అత్యంత వేడి నమోదైందని అంటున్నారు.

అమెరికాకు చెందిన వాతావరణ నిపుణుడు కోలిన్‌ మెక్‌ కార్తీ తెలిపిన వివరాల ప్రకారం... ఇరాన్‌ విమానాశ్రయంలో మధ్యాహ్నం 12.30 సమయంలో టెంపరేచర్ 66.7 డిగ్రీల సెల్సియస్‌ చూపించిందని ఆయన ట్విటర్‌ లో వెల్లడించారు. ఈ వేడిని మానవులు, జంతుజాలం భరించలేవని చెప్పారు.

అయితే పర్షియన్‌ గల్ఫ్‌ లోని చాలా వెచ్చని నీటిపై ప్రవహించే తేమతో కూడిన గాలి.. లోతట్టు ప్రాంతాల్లోని వేడిని తాకడంతో ఇరాన్‌ లో భయంకర ఉష్ణోగ్రత వెలుగు చూసిందని తెలుస్తుంది. ఇలాంటి వేడి మానవులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారని తెలుస్తుంది. తగినంత నీరు తీసుకోకపోతే చెమట, మూత్రం రూపంలో ఎక్కువ నీరు బయటకు వెళ్లి డీ హైడ్రేషన్‌ కు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారని తెలుస్తుంది.

ఇదే సమయంలో... ఈస్థాయిలో వేడి ఉంటే... రక్తం చిక్కబడటం, అనంతరం గడ్డకట్టే స్థాయికి చేరుకోవడం వంటివి జరుగుతాయని అంటున్నారట. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం కూడా రావొచ్చని వైద్యులు వెల్లడించారని అంటున్నారు. అప్పటికే అనారోగ్య సమస్యలున్న వృద్ధులకు ఈ వాతావరణం మరింత ప్రమాకరమని హెచ్చరించారని తెలుస్తుంది.

బ్లూమ్‌ బర్గ్‌ నివేదిక ప్రకారం జులై నెలలో 10 రోజులు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలుస్తుంది. ఫ్లోరిడాలో అట్లాంటిక్‌ జలాలు 32.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను తాకగా.. చైనాలోని శాన్‌ బో టౌన్‌ షిప్‌ లోనూ రికార్డు స్థాయిలో 52.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలుస్తుంది.