Begin typing your search above and press return to search.

భారత టూరిస్టులకు గుడ్ న్యూస్... ఇకపై శ్రీలంకకు నో వీసా!

ఇకపై ఆయా దేశాలకు ఉచిత టూరిస్టు వీసాలు ఇవ్వాలని తాజాగా సమావేశమైన శ్రీలంక కేబినెట్ నిర్ణయించింది.

By:  Tupaki Desk   |   24 Oct 2023 12:06 PM GMT
భారత టూరిస్టులకు గుడ్  న్యూస్... ఇకపై శ్రీలంకకు నో వీసా!
X

పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... భారత్‌ సహా ఏడు దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్ట్‌ గా దీన్ని చేపట్టనుందని తెలుస్తుంది. ఈ మేరకు శ్రీలంక కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు.

అవును... గతేడాది తలెత్తిన ఆర్ధిక సంక్షోభంతో ద్వీప దేశం శ్రీలంక అపసోపాలు పడిన సంగతి తెలిసిందే. ద్వీపకల్పం అయిన భారత్ పక్కనున్న ఈ ద్వీపదేశం... ఆర్ధిక సంక్షోభం నుంచి బయట పడేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రధానంగా... శ్రీలంక ఆర్ధిక వ్యవస్ధకు కీలకమైన పర్యాటకాన్ని భారీ ఎత్తున, యుద్ధ ప్రాతిపదికన ప్రోత్సహించాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగానే పక్కనున్న భారత్ సహా ఆరు దేశాలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆయా దేశాలకు ఉచిత టూరిస్టు వీసాలు ఇవ్వాలని తాజాగా సమావేశమైన శ్రీలంక కేబినెట్ నిర్ణయించింది. దీంతో... శ్రీలంక టూర్ కి వెళ్లాలనుకునే చైనా, రష్యా, మలేసియా, జపాన్‌, ఇండోనేసియా, థాయిలాండ్‌ దేశాలకు చెందిన పౌరులు ఇక నేరుగా శ్రీలంకకు విచ్చేయొచ్చు. ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉండనుంది.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక తమ పర్యాటక రంగాన్ని పునర్నిర్మించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకే ఈ పైలట్ ప్రాజెక్ట్ అమల్లో ఉంటుందని చెబుతున్నప్పటికీ... ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని తిరిగి సమీక్షించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీంతో... వచ్చే ఏడాది సమ్మర్ వరకూ ఈ ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

వాస్తవానికి శ్రీలంక దేశానికి పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు అనేది తెలిసిన విషయమే. ఈ సమయంలో కొవిడ్‌-19 రావడం.. దీనికితోడు ఆ దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం మూలంగా పర్యాటకుల రాక చాలావరకూ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి ఊపిరి పోయాలని ఆ దేశం నిర్ణయించింది. ఫలితంగా విదేశీ మారకం సమకూర్చుకోవాలని ఫిక్సయ్యింది.

ఇందులో భాగంగా ఈ ఏడాది సుమారు 20 లక్షల మందిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుందట శ్రీలంక. ఇందులో భాగంగానే వీసా ఫ్రీ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. గత కేబినెట్‌ సమావేశంలోనే ఈ అంశం చర్చకు వచ్చిన సమయంలో... ముందుగా 5 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్‌ కు అనుమతివ్వాలని భావించినప్పటికీ తాజాగా దాన్ని 7 దేశాలకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.