వీసాల విషయంలో ఆస్ట్రేలియా అంత షాక్ ఇచ్చిందా?
గత కొన్ని నెలలుగా ఇజ్రాయేల్ - గాజాల మధ్య యుద్ధం అవిరామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 16 Aug 2024 9:30 PM GMTగత కొన్ని నెలలుగా ఇజ్రాయేల్ - గాజాల మధ్య యుద్ధం అవిరామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం వల్ల గాజాలో భాయానక వాతావరణం సృష్టిస్తోంది ఐడీఎఫ్. ఈ నేపథ్యంలో వేలాదిమంది పాలస్తీనియన్లు మరణిస్తున్నారు. ఇంకొంతమంది శరణార్థులుగా పునరావాసాల కోసం ప్రత్యత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు దేశాలకు వీసాల కోసం దరఖాస్తు చేసుకొంటున్నారు.
ఇందులో భాగంగానే ఆస్ట్రేలియాకు వీసాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అటు ఇజ్రాయేల్ పౌరులు కూడా వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే... వీటిలో పాలస్తీనీయన్ల వీసాలు భారీ ఎత్తున రిజెక్ట్ అవుతుండగా.. ఇజ్రాయేల్ పౌరుల వీసాలు మాత్రం ఆమొదం పొందుతున్నాయని తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఇప్పటివరకూ సుమారు 10వేల మంది పాలస్తీనియన్లు ఆస్ట్రేలియాకు విసాకు దరఖాస్తు చేసుకున్నారని ఆ దేశ హోంశాఖ మంత్రి టోనీ బుర్కో పేర్కొన్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం... 10వేల మంది పాలస్తీనీయన్లు ఆస్ట్రేలియాకు వీసాకు దరఖాస్తు చేసుకోగా.. వీటిలో కేవలం సుమారు 3 వేల వీసాల ఆమోదం పొందగా.. సుమారు 7వేలకు పైగా తిరస్కరణకు గురైన పరిస్థితి.
ఇక ఇజ్రాయేల్ పౌరుల విషయానికొస్తే వీరు దరఖాస్తు చేసుకున్న వీసాల్లో 235 మాత్రం తిరస్కరణకు గురవ్వగా.. 8,646 వీసాలు ఆమోదం పొందాయి. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి గల కారణం కూడా తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా హమాస్ కు మద్దతు ఇవ్వటం లేదని ఇటీవల ఆస్ట్రేలియా సంకీర్ణ పార్లమెంట్ సభ్యులు నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు.
ఈ కారణంతోనే గాజా నుంచి వచ్చే వీసా దరఖాస్తులను పెద్ద ఎత్తున తిరస్కరిస్తున్నారని.. ఇదే సమయంలో వీసా కండిషన్స్ ని కూడా కఠినతరం చేయాలని నిర్ణయించారని అంటున్నారు. ఆస్ట్రేలియాలోని పాలస్తీనియన్ల ప్రవేశం జాతీయ భద్రతకు ముప్పు అని అటు అధికార పక్షంతో పాటు ఇటు ప్రతిపక్షం కూడా బలంగా భావిస్తుందని చెబుతున్నారు.