Begin typing your search above and press return to search.

తుపాకీ ఎక్స్ క్లూజివ్.. రవి ప్రభు.. 195 దేశాలు తిరిగిన ఏకైక తెలుగోడు

ప్రపంచాన్ని జయించడం ఆ అలెగ్జాండర్ వల్ల కాలేదు కానీ.. ప్రపంచాన్ని తిరిగి రావడం ఈ తెలుగోడికి సాధ్యమైంది.. అదీ కేవలం ట్రావెలింగ్ మీద ఉన్న ప్యాషన్ తో..

By:  Tupaki Desk   |   22 July 2024 8:41 AM GMT
తుపాకీ ఎక్స్ క్లూజివ్.. రవి ప్రభు.. 195 దేశాలు తిరిగిన ఏకైక తెలుగోడు
X

మనం అందరం చదువుకునే రోజుల్లో వరల్డ్ మ్యాప్ చూసి ఉంటాం.. చాలా దేశాల గురించి తెలుసుకుని ఉంటాం.. కానీ అతడు మాత్రం వరల్డ్ మ్యాప్ చూసి అందులోని ప్రతి దేశం చుట్టి రావాలని కలలు కన్నాడు.. అంతటితో సరిపెట్టుకోలేదు.. ఏకంగా లక్ష్యంగా పెట్టుకున్నాడు.. దానికి తగినట్లుగా కెరీర్ ను మలుచుకున్నాడు.. ముందుగా మంచి చదువుతో అమెరికా చేరాడు.. అక్కడ ఉద్యోగం సంపాదించాడు.. ఉన్నత స్థాయికి ఎదిగాడు.. అలా మధ్య మధ్యలోనే ఒక్కో దేశాన్ని చూసి రావడం మొదలుపెట్టాడు. ప్రపంచాన్ని జయించడం ఆ అలెగ్జాండర్ వల్ల కాలేదు కానీ.. ప్రపంచాన్ని తిరిగి రావడం ఈ తెలుగోడికి సాధ్యమైంది.. అదీ కేవలం ట్రావెలింగ్ మీద ఉన్న ప్యాషన్ తో..

చెయ్యెత్తి జై కొట్టు.. కదిలి విదేశంపై కాలిడు..

'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘన కీర్తి కలవాడా?’ ఇది మనం ఎంతో గొప్పగా పాడుకునే పాట. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణానికి చెందిన రవి ప్రభు విషయంలో ఈ పాటను చెప్పాల్సి వస్తే.. 'కదిలి కాలిడు విదేశీ గడ్డపై ఓ తెలుగోడా?’ అని అనాల్సి ఉంటుందేమో? మరి అతడు సాధించిన ఘనత అలాంటిది..? ఏమిటీ ఆ గొప్ప అంటే.. ప్రపంచంలోని అన్ని దేశాల (195)లో పర్యటించిన ఏకైక తెలుగు వ్యక్తి అని చెప్పాలి. ఇది సాధ్యమా..? అసలు కుదురుతుందా? అని ఎందరికో అనుమానాలు ఉన్నాయి. అయితే, దానికి రెట్టింపు స్థాయి సమాధానాలు, సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయంటున్నారు రవి ప్రభు.

ఎవరీ రవి ప్రభు?

రవి ప్రభు.. అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యక్తి. 1996లోనే అగ్ర రాజ్యానికి వెళ్లారాయన. విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చి సెంట్రల్ యూనివర్సిటీలో చదివిన రవి ప్రభు కేవలం ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ తోనే అమెరికా వీసా సాధించారు. అప్పట్లో ఇదో పెద్ద గొప్ప విషయం అంటే ఆశ్చర్యపోవాల్సిందే. కాగా, రవి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. తల్లి విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా, తండ్రి స్టేట్ బ్యాంకులో ఉద్యోగిగా పదవీ విరమణ చేశారు. 30 ఏళ్ల కిందట చిన్నతనంలో వారు రవిని తొలిసారి నేపాల్ తీసుకెళ్లారు. ప్రపంచాన్ని చుట్టిరావాలన్న కోరిక ఆ సమయంలోనే రవి మనసులో నాటుకుపోయింది. దీనికితగ్గట్లుగా కెరీర్ ను నిర్మించుకుంటూ వచ్చిన ఆయన అమెరికా చేరుకుని ఉద్యోగం సాధించి తన ప్యాషన్ అయిన ట్రావెలింగ్ ను పట్టాలెక్కించారు.

నెదర్లాండ్స్ తో మొదలు..

రవి ప్రభు 1997లో తొలిసారిగా నెదర్లాండ్స్ తో మొదలుపెట్టారు ట్రావెలింగ్. ఇప్పుడు దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాలో ఉన్నారు. ఇది ఆయనకు 195వ దేశం. అంటే.. 27 ఏళ్లలో ప్రపంచంలోని అన్ని దేశాలను తిరిగేశారు. అంటే.. సగటున ఏడాదికి ఏడు దేశాలకు పైనే. కాగా.. రవి కొన్ని దేశాలను పదుల సంఖ్యలో చుట్టివచ్చారు. ఈ లెక్కన చూస్తే ఆయన ఏడాదికి 20 దేశాలకు పైనే తిరిగినట్లు. మరో విషయం ఏమంటే.. రవి అమెరికా పౌరుడు. భార్య స్వాతి కూడా అక్కడ ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. కుమార్తె అనుష్క కాలేజీ చదువుల్లో ఉన్నారు. తల్లిదండ్రులు విశాఖలోనే ఉంటున్నారు. కుటుంబ సభ్యల సంపూర్ణ మద్దతుతో రవి తన జీవితాశయాన్ని నెరవేర్చుకున్నారు. ఓవైపు ట్రావెలింగ్ చేస్తూ మరో ఉద్యోగం చేస్తూ.. అటు కుటుంబానికీ సమయం కేటాయిస్తూ మొత్తానికి జీవితంలో అన్నిటిని బ్యాలెన్స్ చేశారు రవి.

అమెరికాలో ఆ ఇల్లు.. ప్రపంచ గుర్తుల కేంద్రం

టూర్ వెళ్లినప్పుడల్లా ప్రతి దేశం నుంచి ఏదో ఒక మాన్యుమెంట్ ను తీసుకురావడం రవి ప్రభుకు అలవాటు. అలా అమెరికాలోని ఆయన పెద్ద ఇల్లు ఓ ప్రపంచ గుర్తుల కేంద్రంగా ఉందంటే ఆశ్చర్యం కాదు. ఇదంతా రవి తన సొంత యూట్యూబ్ చానల్ ''రవి తెలుగు ట్రావెల్'' వ్లాగ్స్ లో ఎప్పుడో చూపించారు. మూడు నాలుగేళ్ల కిందట ఈ చానల్ ను ఆయన ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి దేశం టూర్ ను అప్ లోడ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ చానెల్ కు 7.85 లక్షల మంది వరకు సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.

''195'' సాధించారోచ్

అమెరికా పౌరుడైన రవి.. 190 దేశాలను చకచకా తిరిగేశారు. కానీ, మిగతా ఐదు దేశాలను చుట్టేసేందుకే చాలా సమయం పట్టింది. ఇందులో ఆయన ప్రయత్నం లోపం లేదు. అమెరికాకు శత్రువులైన ఇరాన్, లిబియా, సిరియా, ఉత్తర కొరియా, వెనెజువెలాలు అమెరికా పౌరులకు వీసాలు ఇవ్వవు. అయితే, రవి ఆ అడ్డంకినీ దాటి వాటిలో టూర్ చేశారు. ఇప్పుడు 195వ దేశంగా వెనెజువెలా పర్యటననూ పూర్తి చేశారు. ఉత్తర కొరియాలో పూర్తిస్థాయి ట్రిప్ చేయకున్నా.. నో మిలటరైజ్డ్ జోన్ (ఎన్ఎండీ) లో పర్యటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఇది. భారత దేశంలోనూ బహుశా అతికొద్దిమంది మాత్రమే అందుకున్న ఘనత ఇది. ''ప్రపంచం చూడాలని అందరికీ ఉంటుంది. కానీ, వివిధ కారణాలతో సాధ్యం కాదు. వారందరికీ నాకు చేతనైనంతగా ప్రపంచాన్ని చూపాను. ఇదొక శాటిస్ఫాక్షన్'' అని ''తుపాకీ''కి చెప్పారు రవి. కాగా, త్వరలో భారత దేశం వస్తున్నానని.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కలిసి తన ఘనతను వివరిస్తానని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినీ కలుసుకుని.. ప్రధాని మోదీ వద్దకు వెళ్లాలనేది అభిలాషగా వివరించారు.