ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ పాస్ పోర్ట్ ఇదే!
అవును... ఇప్పుడు ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ పాస్ పొర్ట్ సింగపూర్ దేశానిదని తెలుస్తుంది.
By: Tupaki Desk | 19 July 2023 4:36 AM GMTఒక దేశం నుంచి మరో దేశంలోకి అడుగుపెట్టాలంటే "వీసా" అనుమతి పత్రం తప్పనిసరనేది తెలిసిన విషయమే. అయితే, కొన్ని దేశాల పాస్ పోర్టులు ఉంటే వారికి వీసాలతో పనిలేకుండా అనేక దేశాలు చుట్టిరావొచ్చు. ఈ క్రమంలో తాజాగా హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ సంస్థ ప్రపంచ శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితా వెల్లడించింది.
లండన్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్టనర్స్ ప్రతి సంవత్సరం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ ల ర్యాంకింగ్ ను విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా గ్లోబల్ ర్యాంకింగ్ 2023 ఇటీవల విడుదలచేసింది. ఈ ర్యాకింగ్స్ లో... సింగపూర్ పాస్ పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా అవతరించింది.
అవును... ఇప్పుడు ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ పాస్ పొర్ట్ సింగపూర్ దేశానిదని తెలుస్తుంది. ఈ పాస్ పోర్ట్ తో ఎలాంటి వీసా లేకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 192 దేశాలకు ప్రయాణం చేసే సదుపాయం ఉందని అంటున్నారు.
ఇదే సమయంలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాయని అంటున్నారు. ఈ దేశాల పాస్ పోర్టులు కలిగిన వారు ఎలాంటి వీసా అవసరం లేకుండా 190 దేశాలకు వెళ్లవచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ జాబితాలో జపాన్ మూడొస్థానంలో ఉందని తెలుస్తుంది. ఈదేశ పాస్ పోర్ట్ తో వీసా లేకుండా 189 దేశాలకు ప్రయాణించవచ్చట.
ఈ మూడో ప్లేస్ లో జపాన్ తో పాటు, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, దక్షిణ కొరియా, స్వీడన్ పాస్ పోర్ట్ లు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ ర్యాంకింగ్స్ లో డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్ డమ్ దేశాల పాస్ పోర్ట్ లు నాల్గవ స్థానంలో ఉన్నాయని తెలుస్తుంది. ఈ పాస్ పోర్ట్ తో 188 దేశాలలో వీసా లేకుండా ప్రయాణించవచ్చని అంటున్నారు.
ఇదే క్రమంలో... ఐదోస్థానంలో ఉన్న బెల్జియం, చెక్ రిపబ్లిక్, మాల్టా, న్యూజిలాండ్, నార్వే, పోర్చుగల్, స్విట్జర్లాండ్ పాస్ పోర్ట్ లను కలిగి ఉన్న వ్యక్తులు 187 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చని అంటున్నారు.
ఇక ఈ ర్యాంకింగ్స్ లో భారత్ 80వ స్థానంలో ఉందని తెలుస్తుంది. భారతీయ పాస్ పోర్ట్ ఉన్న వ్యక్తులు వీసా లేకుండా ప్రపంచంలోని 57 దేశాలకు మాత్రమే ప్రయాణించవచ్చు. ఈ జాబితాలో చైనా 63వ స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ 100వ స్థానంలో ఉందని తెలుస్తుంది. చైనా ప్రజలు వీసా లేకుండా 80 దేశాల్లోనూ, పాకిస్థాన్ ప్రజలు 33 దేశాల్లోనూ ప్రయాణించవచ్చని అంటున్నారు.