Begin typing your search above and press return to search.

డార్క్‌ టూరిజం అంటే ఏమిటి?.. ఎందుకు ఎగబడుతున్నారు?

కొత్త ప్రదేశాలను చూడాలని, కొత్త ప్రదేశాలకు వెళ్లాలని కోరుకోనివారెవరూ? అంతా తమ ఆర్థిక పరిస్థితులను బట్టి దేశ, విదేశాల్లో విహార యాత్రలు చేస్తుంటారు.

By:  Tupaki Desk   |   10 Sep 2024 6:50 AM GMT
డార్క్‌ టూరిజం అంటే ఏమిటి?.. ఎందుకు ఎగబడుతున్నారు?
X

కొత్త ప్రదేశాలను చూడాలని, కొత్త ప్రదేశాలకు వెళ్లాలని కోరుకోనివారెవరూ? అంతా తమ ఆర్థిక పరిస్థితులను బట్టి దేశ, విదేశాల్లో విహార యాత్రలు చేస్తుంటారు. అయితే పర్యాటకుల ట్రెండ్‌ లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బీచ్‌లు, సముద్ర తీరాలు, ప్యాలెస్‌ లు, ప్రసిద్ధ జూ పార్కులు, దేవాలయాలు, వివిధ మతాల ప్రార్థనా మందిరాలు వంటి వాటిని చూడటానికి ప్రాధాన్యత ఇచ్చేవారు.

అయితే ఇప్పుడు పర్యాటకులు తమ ప్రాధాన్యతలను మార్చుకున్నారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, యుద్ధ క్షేత్రాలు, కల్లోల, సంక్షోభ పరిస్థితులకు అడ్డాలుగా నిలిచిన ప్రాంతాలను చూడటానికి ఇష్టపడుతున్నారు. దీన్నే డార్క్‌ టూరిజం అంటున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం జరుగుతోంది. అలాగే ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య యుద్ధం జరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్‌ – సిరియా, ఇజ్రాయెల్‌– ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు యుద్ధ సంక్షోభాలకు కేంద్రంగా నిలిచిన రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా తదితర ప్రాంతాలను చూడటానికి మొగ్గుచూపుతున్నారు.

చరిత్రలో పలు విషాదాలకు చారిత్రక సాక్ష్యాలుగా నిలిచిన ప్రాంతాలను సందర్శించడానికి పర్యాటకులు ఇటీవల కాలంలో మొగ్గుచూపుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు 1945లో జపాన్‌ లోని హీరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణు బాంబులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఆ నగరాలను సందర్శించేవారి సంఖ్య పెరుగుతోంది. తద్వారా ఇంతటి దారుణానికి తీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఇప్పుడు ఆ నగరాలు/ప్రాంతాలు ఎలా ఉన్నాయో శోధించి తెలుసుకోవాలనుకుంటున్నారు.

ప్రముఖ యుద్ధాలు జరిగిన ప్రాంతాలు, ప్రసిద్ధ జైళ్లు, కట్టడాలు వంటివాటిని సందర్శించడానికి పర్యాటకులు మొగ్గుచూపుతున్నారు. డార్క్‌ టూరిజం అంటేనే ప్రపంచంలో ఘోరమైన, క్రూరమైన ఘటనలకు సాక్షీభూతాలుగా నిలిచిన ప్రాంతాలను సందర్శించడం.

ఈ నేపథ్యంలో క్రీస్తు పూర్వం ఈజిప్టును పరిపాలించిన రాజుల సమాధులు (పిరమిడ్లు), ప్రపంచ విజేత అలెగ్జాండర్‌ జన్మించిన గ్రీసు, ప్రపంచంలోనే ప్రాచీన నాగరికతలు వెలసిల్లిన మెక్సికో, ఈజిప్టు, భారత్‌ తదితర దేశాలను సందర్శించేవారి సంఖ్య పెరుగుతోంది.

డార్క్‌ టూరిజంలో భాగంగా పర్యాటకులు ప్రధానంగా.. అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, లాటిన్‌ అమెరికా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, రష్యా, పోలాండ్, చెక్‌ రిపబ్లిక్, రొమేనియా, భారత్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్‌ వంటి దేశాలకు వెళుతున్నారు.

ఇక మనదేశంలో భారీ జలప్రళయం సంభవించిన ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలతోపాటు మౌర్యులు, గుప్తులు, మొగలు చక్రవర్తుల కాలంలో విలసిల్లిన ఢిల్లీ, గయ, పాటలీపుత్ర, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలను చూడటానికి పర్యాటకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీల్లో కోటలను, రాజ ప్యాలెస్‌ లను చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు.

అలాగే అండమాన్‌ లోని స్వాతంత్య్ర సమరయోధులను కారాగారంలో ఉంచిన సెల్యులర్‌ జైలు, అమృతసర్‌ లోని జలియన్‌ వాలాబాగ్, గుజరాత్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్‌ లోని సింధు నాగరికత కాలం నాటి ప్రాంతాలు, భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న భుజ్‌ ప్రాంతం భారతీయులకు హాట్‌ ఫేవరెట్‌ డెస్టినేషన్స్‌ గా ఉన్నాయి.