Begin typing your search above and press return to search.

కొందరు భారతీయులకే శుభవార్త చెప్పిన యూఏఈ

కొన్ని ప్రధాన మీడియా సంస్థలతో పాటు.. కొన్ని యూట్యూబ్ చానళ్లు సైతం అత్యుత్సాహాంతో చెలరేగిపోయాయి.

By:  Tupaki Desk   |   19 Oct 2024 6:30 AM GMT
కొందరు భారతీయులకే శుభవార్త చెప్పిన యూఏఈ
X

కొన్ని ప్రధాన మీడియా సంస్థలతో పాటు.. కొన్ని యూట్యూబ్ చానళ్లు సైతం అత్యుత్సాహాంతో చెలరేగిపోయాయి. విషయం ఒకటైతే.. మరో రకంగా చెప్పే ప్రయత్నం చేయటంతోపాటు.. భారతీయులకు శుభవార్త అంటూ చెబుతున్న మాటల్లో ఏ మాత్రం నిజం లేదు. విషయం ఏమంటే.. యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)కు వెళ్లాలనుకునే భారతీయులకు వీసా ఆన్ అరవైల్ (యూఏఈలో అడుగు పెట్టిన తర్వాత వీసా తీసుకునే వెసులుబాటు) సౌకర్యాన్ని కల్పించిందని.. దీన్నో శుభవార్తగా చెబుతున్నారు. అయితే.. ఈ విషయంలోకొంత మాత్రమే నిజం ఉందన్నది మర్చిపోకూడదు.

వీసా ఆన్ అరైవల్ కింద అందరు భారతీయుల కాకుండా ఎంపిక చేసిన.. అర్హులైన భారతీయులకు మాత్రమే వీసా ఆన్ అరైవల్ విధానాన్ని ప్రకటించిందన్నది మర్చిపోకూడదు. ఇందులో అర్హులైన భారతీయులు ఎవరన్న విషయానికి వస్తే.. అందులో అమెరికా.. యూకే.. యూరోపియన్ దేశాల్లో స్థిరపడి.. అక్కడి శాశ్విత నివాస కార్డు లేదంటే వీసా ఉన్న వారికి మాత్రమే వీసా ఆన్ అరైవల్ కు అర్హులు.

అంతే.. భారతీయులు కాదు.. ప్రవాస భారతీయులకు అందునా కొన్ని దేశాల్లో నివాసం ఉండే వారికి మాత్రమే తాజా వీసా ఆన్ అరైవల్ వర్తిస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇది భారతీయులకు ఏ మాత్రం సంతోషకరమైన వార్త కాదు.. సమాచారం కాదు. ఒక విధంగా చెప్పాలంటే.. ఈ నిర్ణయం భారతీయుల్ని రెండు భాగాలుగా విభజిస్తున్నట్లే. అంటే.. భారతీయులు అయినప్పటికీ వారి అర్హతకు సంబంధించి ఇప్పటికే అమెరికా.. యూకే.. యూరోపియన్ దేశాలు ఎవరినైతే గుర్తించి.. వారి పౌరసత్వాన్ని.. ఆయా దేశాల్లో శాశ్విత నివాస సౌకర్యాన్ని అందిస్తాయో.. వారికి మాత్రమే వీసా ఆన్ అరైవల్ అని చెప్పటం చూసినప్పుడు.. మనసుకు ముల్లు గుచ్చుకున్న భావన కలుగక మానదు.

వీరికి కూడా యూఏఈలో అడుగు పెట్టిన వెంటనే 14 రోజుల వీసా లభిస్తుంది. అవసరమైన ఫీజు చెల్లించిన పక్షంలో మరో 60రోజుల వరకు దీనికి పొడిగించుకునే వెసులుబాటు ఉంది. ఇందుకు ఆర్నెల్లు వ్యాలిడిటీ ఉన్న పాస్ పోర్టు కూడా వీరు చూపాల్సి ఉంటుంది. భారత్ - యూఏఈల మధ్య బంధం బలపడుతున్న వేళలో ఈ కొత్త విధానం అమల్లోకి వస్తున్నట్లుగా చెబుతున్న వైనం మనసును ఆకట్టుకోదు. రెండు దేశాల మధ్య బంధం ఎంత బలోపేతం అవుతున్నా.. సగటు భారతీయుల్ని యూఏఈ చూసే తీరు తేడా అన్న విషయం మరోసారి స్పష్టమైందని చెప్పాలి.