విస్తారా.. బుక్ చేసుకునే ముందు ఆలోచించాలట!
ఈ ఎయిర్ లైన్స్ లో టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అనూహ్య రీతిలో విమానాలు ఆలస్యమవుతున్నాయి.
By: Tupaki Desk | 8 April 2024 8:30 AM GMTలగ్జరీ ప్రయాణ అనుభూతిని కలిగించే విమానయాన సంస్థల్లో ఒకటిగా విస్తారా ఎయిర్ లైన్స్ కు పేరుంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా గడిచిన రెండు వారాలుగా ఈ ఎయిర్ లైన్స్ లో టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అనూహ్య రీతిలో విమానాలు ఆలస్యమవుతున్నాయి. గంటల కొద్దీ వెయిటింగ్ పిరియడ్ తో ప్రయాణికుల సహనానికి పరీక్షగా మారింది. పైలట్ల కొరతతో ఇబ్బంది పడుతున్న విస్తారాను వేధిస్తున్న సమస్య.. జీతాలు తక్కువగా ఉన్నాయంటూ వేరే ఎయిర్ లైన్స్ కు పైలెట్లు వెళ్లిపోవటం.. ఆరోగ్య సమస్యల్ని కారణంగా చూపిస్తూ హటాత్తు సెలవులు పెట్టటంతో ఈ విమానయాన సంస్థ ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో విస్తారా సేవలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సంస్థ కీలక ప్రకటన చేసింది. సమ్మర్ ప్లానింగ్ లో భాగంగా తమ విమాన సర్వీసుల్లో 10 శాతం మేర కోత విధించుకున్నట్లుగా పేర్కొంది. అంటే.. రోజుకు 25-30 సర్వీసుల్ని కోత పెట్టుకున్నట్లుగా పేర్కొంది. పైలట్ల కొరత కారణంగా ఈ నెల ప్రారంభం నుంచి కంపెనీ విమాన సర్వీసులు కొన్ని క్యాన్సిల్ అవుతుంటే.. మరికొన్ని ఆలస్యమవుతున్నాయి.
అయితే.. ఈ నెలలో తమ కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకునే వీలుందని చెబుతోంది. ప్రస్తుతం విమాన సర్వీసుల రద్దు దేశీయ మార్గాల్లోనే ఎక్కువగా జరుగుతోందని.. ఈ కారణంగా ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తగ్గించేందుకు తాజాగా తాము చేపట్టిన కోతలు పరిష్కారాన్ని ఇస్తాయని చెబుతున్నారు. రద్దు చేసిన సర్వీస్ లోని ప్రయాణికుల్ని నిబంధనల ప్రకారం ఇతర విమాన సర్వీసుల్లో చోటు కల్పిస్తామని పేర్కొంది.
విస్తారా కొత్త వేతన కాంట్రాక్టులకు వ్యతిరేకంగా ఒక వర్గం పైలట్లు ఈ నెల నుంచి ఆందోళన చేస్తున్నారు. సెలవులో లేని పైలట్లకు అధికంగా విధులు వేస్తుండటంతో విమాన సర్వీసుల్లో అవాంతరాలు.. ఆలస్యాలు ఏర్పడుతున్నాయి. విస్తారాకు మొత్తం 6500 మంది ఉద్యోగులు ఉండగా.. అందులో వెయ్యి మంది పైలట్లు ఉన్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో కచ్ఛితంగా తాము ఫలానా సమయానికి గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంటుందని అనుకునే వారు మాత్రం కొంతకాలం పాటు విస్తారా ఎయిర్ లైన్స్ లో టికెట్లను బుకింగ్ చేసుకునే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయిం తీసుకోవాల్సిన అవసరం ఉందన్న సూచన వినిపిస్తోంది. సో.. జర జాగ్రత్త బాస్.