Begin typing your search above and press return to search.

స్కూలుకు సెలవు పెట్టకుండా 50 దేశాలు... పదేళ్ల చిన్నారి రికార్డ్!

ప్రపంచాన్ని చుట్టేయాలని చాలా మందికి అనిపిస్తుంటుంది

By:  Tupaki Desk   |   22 July 2023 10:34 AM GMT
స్కూలుకు సెలవు పెట్టకుండా 50 దేశాలు... పదేళ్ల చిన్నారి రికార్డ్!
X

ప్రపంచాన్ని చుట్టేయాలని చాలా మందికి అనిపిస్తుంటుంది. మరి ముఖ్యంగా నూతన దంపతులు ఇలాంటి వాటిపై ఎక్కువ ఆసక్తి చూపుతుంటారని అంటుంటారు. ఇదే సమయంలో మరికొంతమందికి పిల్లల స్కూళ్లు, ఆఫీసులో సెలవులు లేని పరిస్థితులతో ఇబ్బందులు పడుతుంటారు.

అయితే సరిగ్గా ప్లాన్ చేయాలే కానీ... అవన్నీ అధిగమించలేని సమస్యలేమీ కావని చెబుతున్నారు బ్రిటన్‌ లో నివాసముంటున్న భారత్‌ సంతతికి చెందిన దంపతులు దీపక్‌ త్రిపాఠి, అవిలాష! ఇందులో భాగంగా వారి కుమార్తె ను ఒక్క రోజు కూడా స్కూల్ మానిపించకుండా.. వారు కూడా ఆఫీసుకు సెలవుపెట్టకుండా ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.

అవును... బ్రిటన్‌ లో నివాసముంటున్న భారత సంతతికి చెందిన దీపక్‌ త్రిపాఠి, అవిలాష దంపతులకు అదితి త్రిపాఠి అనే ముద్దుల కూతురు ఉంది. ఈమె తన తల్లిదండ్రులతో కలిసి ఇప్పటివరకు 50 దేశాలలో పర్యటించింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే... ఈ టూర్స్ కోసం ఆమె ఇప్పటివరకూ ఒక్కరోజు కూడా స్కూల్ కి సెలవు పెట్టలేదు.

అదితి మూడేళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను తొలిసారి జర్మనీకి తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఐరోపా లోని చాలా దేశాలను సందర్శించారు. అప్పటి నుంచి ఈ పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఆమె ఇప్పటికే నేపాల్‌, భారత్‌, థాయిలాండ్, సింగపూర్‌ వంటి ఎన్నో దేశాలను చుట్టేసింది. త్వరలో ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రియాకి కూడా వెళ్లనుందట.

సౌత్‌ లండన్‌ లో నివాసముంటున్న ఆమె తల్లిదండ్రులు బ్యాంకులో అకౌంటెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదితికి చిన్న వయసులోనే వివిధ ప్రాంతాలను చూపించడం వల్ల సమాజంపై అవగాహన పెరగడంతో పాటు వివిధ సంస్కృతి, సంప్రదాయాలు, రకరకాల మనుషుల గురించి తెలుసుకోగలుగుతుందని భావించారు.

దీంతో ఆమె స్కూల్ కి ఇబ్బంది లేకుండా... ఈ టూర్లు ప్లాన్ చేశారని చెబుతున్నారు. అదేలాగంటే... ఏ దేశం వెళ్లాలో ముందుగానే ప్లాన్ చేసుకుని.. ఆ ప్రయాణం శుక్రవారం రాత్రి ఉండేలా ఏర్పాటు చేసుకుంటారంట. ఈ క్రమంలో అదితిని శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి నేరుగా పర్యటనకు తీసుకెళిపోతారంట.

శనివారం అంతా పర్యటన చూసుకుని.. తిరిగి ఆదివారం రాత్రి 11 గంటల వరకు ఇంటికి చేరుకునే విధంగా ప్రణాళిక వేసుకుంటారంట. ఒక్కోసారి పర్యటన నుంచి రావడం ఆలస్యమైతే ఎయిర్‌ పోర్టు నుంచి నేరుగా సోమవారం ఉదయం స్కూల్‌ కి వెళ్లిపోతుందట అదితి.

ఈ సందర్శన కోసం ఏడాదికి 20వేల పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.21 లక్షలు) ఖర్చు చేస్తారట. పర్యటనలో బయట ఆహరం తక్కువగానే తింటూ.. పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టులోనే ప్రయాణిస్తారంట.

ఈ సందర్భంగా స్పందించిన అదితి... "నేను ఇప్పటివరకు ఎన్నో దేశాలు తిరిగాను. వాటిలో నేపాల్‌, జార్జియా, అర్మేనియా అంటే ఎంతో ఇష్టం. ఎవరెస్ట్‌ శిఖరాన్ని కూడా చూశా. గుర్రపు స్వారీ చేశా. ఎన్నో విషయాలను నేర్చుకున్నా. పిల్లలంతా ఆయా దేశాలను చూడాలని కోరుకుంటున్నా. పర్యటనల వల్ల మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు" అని తెలిపింది.