Begin typing your search above and press return to search.

చూసొద్దాం; కర్ణుడి జన్మస్థలికి వెళదామా..!

By:  Tupaki Desk   |   4 July 2015 4:31 PM GMT
చూసొద్దాం; కర్ణుడి జన్మస్థలికి వెళదామా..!
X
స్నేహానికి.. దానానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పాలంటే ఎవరికైనా ముందు గుర్తుకొచ్చే పేరు కర్ణుడు. మహాభారతంలో అత్యంత విలక్షణమైన ఈ పాత్రకు సంబంధించిన ఆసక్తికర అంశాలెన్నో. పురాణగాథగా చెప్పే మహాభారతం నిజంగానే జరిగిందని వాదించే వారెందరో.. అది కేవలం ఒక కథగా వాదించే వారున్నారు. ఈ వాద.. ప్రతివాదాల్ని పక్కన పెడితే.. ఈ పురాణగాథకు సంబంధించి.. అది నిజంగా జరిగిందని చెప్పేలా చాలానే ఆధారాలు చూపిస్తారు.

కర్ణుడు జననమే ఆసక్తికరం. కుంతీదేవికి ఉన్న వరంతో సూర్యదేవుడి కారణంగా కలిగిన సంతానం కర్ణుడు. సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్యతేజస్సుతో ప్రకాశించేవాడు. కర్ణుడి జన్మ జరిగిన ప్రదేశమే కర్నాల్‌గా చెబుతారు. హర్యానాలోని జిల్లా కేంద్రంగా ఈ నగరం ఉంది. కర్ణుడి పేరుతో నిర్మితమైన ఈ నగరం నుంచి ఓ పావుగంట ప్రయాణంతో కర్ణ లేక్‌ను చేరుకునే వీలుంది.

ఈ సరస్సుకు చారిత్రక నేపథ్యం ఉందని చెబుతారు. ఈ సరస్సులో స్నానం చేసిన తర్వాతే తన రక్షణ కవచాన్ని ఈ సరస్సు దగ్గరే దానం చేశారని చెబుతారు. ఈ సరస్సు చుట్టూ అందమైన ప్రకృతి దృశాలు చూపురుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. పచ్చికతో.. చుట్టూ చెట్లతో అలరించే ఈ ప్రాంతంలో పలువురు పర్యాటకలు వస్తుంటారు.

ఇక కర్నాల్‌లో చూడాల్సిన ప్రాంతాలకు వస్తే.. కర్నాల్‌ కంటోన్మెంట్‌ చర్చి టవర్‌.. బాబర్‌ మసీదు తదితర ప్రాంతాలున్నాయి. కంటోన్మెంట్‌ చర్చి టవర్‌ను.. బ్రిటీష్‌ నిర్మాణ కళకు ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పొచ్చు. పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షించే ఈ చర్చిని తప్పనిసరిగా చూడాల్సిన ప్రాంతాల్లో ఒకటిగా చెబుతారు.
ఇక.. బాబర్‌ మసీదు విషయానికి వస్తే.. కర్నాల్‌ నగర నడిబడ్డున ఉండే ఈ మసీదును 1528లో పూర్తి చేశారు. ఇబ్రహీం లోధి మీద విజయానికి నిదర్శనంగా బాబర్‌ దీన్ని నిర్మించినట్లు చెబుతారు. పర్షియన్‌ వాస్తుశిల్పి మీర్‌ బాగి నిర్మించిన ఈ మసీదు నిర్మాణశైలి ప్రతిఒక్కరిని ఆకర్షిస్తుందనటంలో సందేహించాల్సిన అవసరం లేదు.

మరి.. కర్నాల్‌కు చేరుకోవటం ఎలా అంటే.. నేషనల్‌ హైవే 1 మీద ఉంటే ఈ పట్టణం ఢిల్లీ.. చండీగఢ్‌ మధ్యన ఉంది. ప్రభుత్వ.. ప్రైవేటు బస్సుల సౌకర్యం ఉంది. రోడ్డు మార్గంలో ఢిల్లీ.. చండీగఢ్‌ నుంచి చేరుకునే వీలుంది. ఇక.. రైలుమార్గం విషయానికి వస్తే.. ఢిల్లీ.. సిమ్లా.. అంబాలా.. నుంచి చేరుకునే వీలుంది. కర్నాల్‌కు దగ్గరగా ఉన్న విమానాశ్రయం విషయానికి వస్తే.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ ఒక్కటే. విమానాశ్రయం నుంచి కర్నాల్‌ పట్టణం 125 కిలోమీటర్ల దూరంలో ఉంది.