Begin typing your search above and press return to search.

తాజ్‌మహల్‌కి యమునా నదికి లింకుందా?

By:  Tupaki Desk   |   9 July 2015 5:01 AM GMT
తాజ్‌మహల్‌కి యమునా నదికి లింకుందా?
X
యమునా నది ఒడ్డున ఠీవీగా కనిపించే తాజ్‌మహాల్‌ కట్టడం ప్రపంచ ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకునే విషయం తెలిసిందే. భారతదేశం అంటే ఏమిటో సరిగా అవగాహన లేని వారికి సైతం రెండు విషయాలు భారత్‌కు గురించి చెప్పుకుంటారు. అందులో ఒకటి.. ఇక్కడ ప్రజలు పాములు.. కోతులతో ఆడుకుంటారన్న అపవాదుతో పాటు.. రెండోది తాజ్‌ మహాల్‌.

దేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన తాజ్‌మహాల్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన చర్చ ఒకటి మొదలైంది. ఈ అద్భుత కట్టడం పక్కనే ఉన్న యమునలో నీటి ప్రవాహం తగ్గితే తాజ్‌మహాల్‌కు ముప్పు అంటూ చరిత్రకారుడు హజీ తహీరుద్దిన్‌ పేర్కొంటున్నారు.

ఆయన చేస్తున్న వాదన ఏమిటంటే.. తాజ్‌మహాల్‌ పునాదికి బలం యమునా నది నీళ్లేనని.. యాభై ఏళ్ల కిందట నదిలో నీళ్లు తగ్గినప్పుడు తాజ్‌మహాల్‌ నిర్మాణంలో ఉపయోగించిన రాయి పొడిబారినట్లు కనిపించిందని చెబుతున్నారు. యమునానది నీటి ప్రవాహం తగ్గి.. గాలిలో తేమ తగ్గటం వల్లే అలా జరిగిందని చెబుతున్నారు.

ఈ వాదనను భారత పురావస్తు శాఖ అధికారులు కొట్టేస్తున్నారు.. యమునానదిలో నీటి ప్రవాహానికి.. తాజ్‌మహాల్‌ కట్టడానికి ఎలాంటి సంబంధం లేదని.. నది చుట్టూఉన్న పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం వల్లనే ఈ అద్భుత కట్టటం మసకబారుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా.. తాజ్‌మహాల్‌కు సంబంధించి మరింత మందితో మరిన్ని కోణాల్లో పరీక్ష జరపటం మంచిదేమో.