Begin typing your search above and press return to search.

గాంధీ పుట్టిన ప్రదేశం... చూడటానికి చాలా ఉంటుంది!

By:  Tupaki Desk   |   8 Jun 2015 10:12 AM GMT
గాంధీ పుట్టిన ప్రదేశం... చూడటానికి చాలా ఉంటుంది!
X
గాంధీ పుట్టిన దేశమా ఇదీ, నెహ్రూ కోరిన సంఘమా ఇది అనే పాట సంగతి కాసేపు పక్కనపెడితే... గాంధీ పుట్టిన దేశం సరే కానీ గాంధీ పుట్టిన ప్రదేశం గురించి తెలుసుకుందాం! అదే గుజరాత్ రాష్ట్రంలోని పోరు బందర్ ప్రాంతం! ఇక్కడ గల పురాతన ఓడరేవు వల్ల... ఈ ప్రాంతాన్ని ఓడరేవు ప్రాంతం అంటారు కానీ అలా అంటే ఎవరూ గుర్తుపట్టరు! అదే... గాంధీ పుట్టిన ప్రదేశం అని అంటే చిన్న పిల్లలైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు! మహాత్ముడిని మనకు అందించిన ప్రదేశంలో సందర్శించడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి!

ఇక పురాణాలు, పురాతన విషయాలకి వస్తే... ఈ ప్రదేశం శ్రీ కృష్ణుడి మంచి మిత్రుడు అయిన సుధాముడు జన్మించిన స్థలం అని అందుకే ఈ పోరు బందర్ ని "సుధామ పురి" అని కూడా పిలుస్తారని చెబుతారు! మొగలులు, పీశ్వాలు, బ్రిటిష్ వారి కింద పోర్ బందర్ ఒక ప్రధాన వాణిజ్య ఓడ రేవుగా ఓడలు ఈస్ట్ ఆఫ్రికా, అరబ్, పెర్షియన్ గల్ఫ్ దేశాలకు ప్రయాణాలు చేసేవి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కథియవార్ ఐక్య రాష్ట్రం ఒప్పందాల మేరకు పోర్ బందర్ ను గుజరాత్ రాష్ట్రం లో విలీనం చేశారు! ఇంత విశిష్టతలున్న పోరు బందర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!

ముందుగా పోరు బందర్ కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం...

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పోర్ బందర్ కు కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మించింది! ఇక్కడ ప్రతి రోజూ ముంబై టు పోర్ బందర్ విమానాలు నడుస్తాయి.

ఇక రైల్ విషయానికి వస్తే... పోర్ బందర్ పట్టణం రైలు స్టేషన్ దేశం లోని అన్ని ప్రధాన స్టేషన్ లకు కలుపబడి వుంది. ఒఖా, రాజ్ కోట్, ముంబై , భంవాడ లకు ప్రతి రోజూ రైళ్ళు ఉన్నాయి. ఢిల్లీ, మోతిహారి, హవురా లకు కూడా పోరు బందర్ నుండి రైల్ సౌకర్యం ఉంది!

చూడవలసిన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

కీర్తి మందిర్

మూడు అంతస్తుల ఈ పోర్ బందర్ బ్లూ హవేలీ లో 1869 అక్టోబర్ 2 నాడు మహాత్మ గాంధీ జన్మించారు. దాంతో ఇది కాస్తా "కీర్తి మందిర్" గా ప్రసిద్ధి చెందింది. అనంతరం దీనిని మ్యూజియంగా మార్చి... గాంధీ జీవిత విశేషాలను తెలియచెప్పే ఫోటోలు, గాంధీ ఉపయోగించిన వస్తువులను ఉంచారు. గాంధీ ఫిలాసఫీకి సంబంధించిన కొన్ని పుస్తకాలతో ఒక అందమైన లైబ్రరీ కూడా ఈ భవనంలో నిర్వహిస్తున్నారు.

పోర్ బందర్ బీచ్

ఈ బీచ్ ని "చౌ పాటి" అని కూడా అంటారు. దర్శకులు కూర్చుని విశ్రాంతి పొండడానికి అనువుగా సీటింగ్ ఏర్పాట్లు కూడా ఈ బీచ్ లో ఉంటాయి! ఇదే సమయంలో పిల్లలకు వినోద సౌకర్యాలు కూడా పుష్కలంగా ఉంటాయి! మరో అతిముఖ్యమైన విషయం ఏమిటంటే... ప్రతి సంవత్సరం చౌ పాటి లో కృష్ణాష్టమి ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి!

హుజూర్ ప్యాలస్

ఈ ప్యాలస్ ను పోర్ బందర్ చివరి పాలకుడు అయిన రానా నట్వర్ సింగ్ జి నిర్మించారు! దీనిని 20 శతాబ్దపు మొదటి భాగంలో మెరైన్ డ్రైవ్ సముద్రపు ఒడ్డున నిర్మించారు. అద్భుతమైన ఈ భవనం నుండి సముద్రపు అందాలను చాలా బాగా వీక్షించొచ్చు.

పోర్ బందర్ బర్డ్ సంక్చురి

మిగిలిన వాటిలా కాకుండా ఈ బర్డ్ సంక్చురి లో ప్రకృతి - పక్షులు కలసి జీవనం సాగిస్తుంటాయి. మొదట్లో ఇది పచ్చటి చెట్లు, మొక్కలతో నీటి సరస్సుగా అత్యంత అందంగా ఉండేడి! అయితే దీనిని 1988లో సంక్చురి గా ప్రకటించి నిర్వహిస్తున్నారు. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి వింటర్ అనుకూల సమయమనే చెప్పాలి! ఆ సీజన్ లో అయితే ప్రపంచం లోని వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చిన వివిధ రకాల పక్షులు ఉంటాయి!

బార్దా హిల్స్ వైల్డ్ లైఫ్ సంక్చురి

పోర్ బందర్, జం నగర్ అనే రెండు జిల్లాలకు సంబందించింది ఈ సంక్చురి! ఇది పోరు బందర్కు 15 కి.మీ.ల దూరంలో ఉంటుంది! అందమైన కొండ మార్గాలతో, మైదాన భూమితో, చిన్నపాటి నీటి వాగులతో, చుట్టూ పచ్చని అడవి, కంటికి ఇంపైన వ్యవసాయ భూములు కలిగిన అద్భుతప్రదేశం ఇది! కనుమరుగవుతున్న అనేక జంతువులు, పక్షులు, పాములు, ఈ సంక్చురిలో మనకు దర్శనం ఇస్తాయి! ఈ సంక్చురి సుమారు 192.31 చ.కి.మీల విస్తీర్ణం లో వుండి ఎన్నో ఔషధ మొక్కలను కూడా కలిగి ఉంటుంది! మరో విషయం ఏమిటంటే... ఈ సంకుర్చి లో రెండు చిన్న నదులు కూడా ప్రవహిస్తుంటాయి!