సీఐపై కానిస్టేబుల్ కత్తితో దాడి... తెరపైకి వివాహేతర సంబంధం?
ఇటీవల వివాహేతర సంబంధాలకు సంబంధించిన కేసులు భారీ సంఖ్యలో మీడియాలో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 Nov 2023 6:03 AM GMTఇటీవల వివాహేతర సంబంధాలకు సంబంధించిన కేసులు భారీ సంఖ్యలో మీడియాలో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాహేతర కారణాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి! ఫలితంగా... వారిని నమ్ముకుని వెనుక ఉన్న పిల్లలు, వారి వృద్ధ తల్లితండ్రులు అనాధలైపోతున్నారు. ఇలా వివాహేతర సంబంధాలు, తదనంతర పరిణామాలు రోజు రోజుకీ సమాజంలో భయాందోళనలు పెంచేస్తున్నాయి!
ఈ క్రమంలో తాజాగా తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో తన పై అధికారి అయిన సర్కిల్ ఇన్స్ పెక్టర్ పై కానిస్టేబుల్ దాడి చేశాడని తెలుస్తుంది. అతని భార్య, మరికొంతమంది డిపార్ట్ మెంట్ వ్యక్తులే సహకరించారని అనుమానిస్తున్న ఈ దాడిలో... సదరు సీఐపై విచక్షణారహితంగా దాడిచేయడంతోపాటు.. కత్తితో మర్మాంగాలు కొసేసి తీవ్రంగా గాయపర్చాడని తెలుస్తుంది.
వివరాళ్లోకి వెళ్తే... మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లోని సీఐ... అదే స్టేషన్ లోని కానిస్టేబుల్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడట! ఈ విషయం సదరు కానిస్టేబుల్ కి తెలియడంతో అతను సీరియస్ గా రియాక్ట్ అయ్యాడని.. ఇందులో భాగంగా సీఐపై కత్తితో దాడిచేశాడని తెలుస్తుంది. ఇదే సమయంలో తనచేతిలోని కత్తిలో సీఐ మర్మాంగాలను సైతం కోసేశాడని సమాచారం!
దీంతో తీవ్రంగా గాయపడిన సీఐని స్థానికులు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారని అంటున్నారు. అయితే సీఐ పరిస్థితితి విషమిస్తుండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తరలిస్తున్నారని అంటున్నారు. ఈ దాడికి అతని భార్య, తోటి కానిస్టేబుళ్లు సైతం సాయం చేశారని చెబుతుండటం గమనార్హం.
కాగా సంఘటన స్థలానికి డీఐజీ, ఎస్పీ చేరుకొని వివరాలను సేకరిస్తున్నారని తెలుస్తుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు ధృవీకరించారని అంటున్నారు. దీంతో... ఈ దారుణ సంఘటన పోలీసు వర్గాలలో కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.