రానా 'హిరణ్యకశ్యప' కాన్సెప్ట్ టీజర్.. ఎలా ఉందంటే..
ఈ చిత్రాన్ని ప్రముఖ కామిక్ కథలు అమర్ చిత్ర కథ నుంచి తీసుకుని రూపొందిస్తున్నారు రానా
By: Tupaki Desk | 26 July 2023 8:46 AM GMTయాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి.. ఈ మధ్యే తన కొత్త భారీ పీరియాడిక్ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాలోని శాన్ డీగో వేదికగా జరిగిన ప్రఖ్యాత కామిక్ కాన్ 2023 ఈవెంట్లో గ్రాండ్‌గా హిరణ్యకశ్యప అనే భారీ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఓ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేసి సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగించారు. తన సొంత బ్యానర్ స్పిరిట్ మీడియాపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు రానా తెలిపారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ను రిలీజ్ చేశారు. సోషల్‌మీడియా వేదికగా.. హిరణ్యకశ్యప కాన్సెప్ట్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ ప్రచార చిత్రం.. కామిక్స్ రూపంలో ఉన్న ప్రహ్లాద పాత్రను చూపిస్తూ మొదలైంది. ఆ తర్వాత హిరణ్యకశ్యపతో పాటు మరో రెండు మూడు ఇతర పాత్రలను అన్నీ డ్రాయింగ్స్ రూపంలో చూపించినట్టు అర్థమవుతోంది. ఆ కాలంలో జరిగిన సంఘటనలను కూడా కామిక్ రూపంలో కాస్త వివరించేందుకు ప్రయత్నించారు. చివరిగా ఫస్ట్ లుక్ పోస్టర్ తరహాలో ఉన్న కామిక్ హిరణ్యకశపను చూపించి ముగించారు. చూపించిన డ్రాయింగ్స్ కన్నా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మొత్తంగా ఈ కాన్సెప్ట్ టీజర్.. సినిమా ఎలా ఉండబోతుందో అన్న కాస్త ఆసక్తిని రేకెత్తించింది.
ఈ చిత్రాన్ని ప్రముఖ కామిక్ కథలు 'అమర్ చిత్ర కథ' నుంచి తీసుకుని రూపొందిస్తున్నారు రానా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ చిత్రం అనౌన్స్మెంట్తోనే ఓ వివాదంలో చిక్కుకుంది. సినిమా ప్రకటించగానే ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దీనిపై స్పందించారు. పరోక్షంగా త్రివిక్రమ్-రానాపై విమర్శలు చేశారు.
వాస్తవానికి ఈ సినిమా గుణశేఖర్-రానా కాంబోలో తెరకెక్కాల్సింది. దీనిపే చాలా కాలం పాటు గుణ్శేఖర్ పని చేశారు కూడా. రానాతో కలిసి చర్చలు కూడా జరిపారు. కానీ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాను కాస్త గ్యాప్ ఇచ్చి తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు.
ఆ తర్వాత గుణశేఖర్.. సమంతతో కలిసి శాకుంతలం అనే పీరియాడిక్ చిత్రాన్ని తీశారు. ఎన్నో అంచనాలతో వచ్చి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అనంతరం రానా రీసెంట్గా కామిక్ కాన్ వేదికపై హిరణ్యకశ్యప్ను ప్రకటించారు కానీ.. గుణశేఖర్ పేరు మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. కేవలం త్రివిక్రమ్ పేరు మాత్రమే చెప్పారు.
బహుశ శాకుంతలం డిజాస్టర్ అవ్వడం వల్లే రానా.. గుణశేఖర్‌ను సైలెంట్‌గా సైడ్ చేశారని అంతా అన్నారు. ఈ విషయం చిత్రసీమలో చర్చనీయాంశమైంది. గుణశేఖర్ కూడా దేవుడన్నీ చూస్తాడంటూ పరోక్షంగా విరుచుకుపడ్డారు. చూడాలి మరి రానా ఈ భారీ విజువల్ ప్రాజెక్ట్‌ను తీసుకెళ్లి.. గుణశేఖర్ చేతిలోనే పెడతారో లేదా ఇంకెవరికైనా అప్పగిస్తారా. ఏదేమైనా రీసెంట్గా ఆదిపురుష్ విషయంలో జరిగిన పరిణామాలన్నింటినీ అంచనా వేసుకుని జాగ్రత్తగా సినిమా తీయాల్సిన పెద్ద బాధ్యత రానాపై ఉంది.