Begin typing your search above and press return to search.

స్పెయిన్‌ ముద్దు వివాదం.. ఎంతపని చేసింది చీఫ్?

మనకు అమితానందం వేసిందని ఎవరికి బడితే వారిని, ఎక్కడ బడితే అక్కడ ముద్దుపెట్టుకుంటే మూతే కాదు ఇంకా చాలానే వాచిపోతాయనే అనుభవం తాజాగా స్పెయిన్‌ ఫుట్‌ బాల్ ఫెడరేషన్ చీఫ్‌ కు ఎదురైంది.

By:  Tupaki Desk   |   27 Aug 2023 4:53 PM GMT
స్పెయిన్‌ ముద్దు వివాదం.. ఎంతపని చేసింది చీఫ్?
X

మనకు అమితానందం వేసిందని ఎవరికి బడితే వారిని, ఎక్కడ బడితే అక్కడ ముద్దుపెట్టుకుంటే మూతే కాదు ఇంకా చాలానే వాచిపోతాయనే అనుభవం తాజాగా స్పెయిన్‌ ఫుట్‌ బాల్ ఫెడరేషన్ చీఫ్‌ కు ఎదురైంది. దీంతో క్షమాపణలు చెప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది. క్రమశిక్షణా చర్యల విషయంలో ఫిఫా తగ్గేదే లేదంది!

సిడ్నీలో జరిగిన ఫైనల్‌ లో 1-0 తేడాతో ఇంగ్లాండ్‌ ను ఓడించి స్పెయిన్ తొలి ఫిఫా మహిళ ప్రపంచకప్‌ టైటిల్‌ ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు మెడల్స్‌ అందిస్తూ.. స్పెయిన్‌ ఫుట్‌ బాల్ ఫెడరేషన్ చీఫ్‌ లూయిస్‌ రుబియాలెస్‌ క్రీడాకారిణులతో అనుచితంగా ప్రవర్తించారు.

ఇందులో భాగంగా... స్టార్‌ ప్లేయర్ అయిన జెన్నిఫర్ హెర్మోసో ను ముద్దాడారు. ఇదే క్రమంలో ఇతర క్రీడాకారిణుల చెంపలను చుంబించారు! దీంతో వ్యవహారం వివాదాస్పదమైది. దీనికి ఆయన క్షమాపణలు చెప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది.

అవును... స్పానిష్ సాకర్ ఫెడరేషన్ జనరల్ అసెంబ్లీ అత్యవసర సమావేశంలో లూయిస్‌ రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఫిఫా క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా 90 రోజుల పాటు లూయిస్‌ పై సస్పెన్షన్‌ విధించింది.

అయితే ఈ విషయాలపై స్పందించిన లూయిస్‌... క్రీడాకారిణి అంగీకారంతోనే ముద్దుపెట్టినట్లు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యను సదరు స్పెయిన్‌ స్టార్‌ క్రీడాకారిణి ఖండించింది. అయితే ఈమె వ్యాఖ్యలను కూడా స్పానిష్‌ ఫుడ్‌ బాల్‌ ఫెడరేషన్‌ తప్పుబట్టింది. ఆమె అబద్ధాలు ఆడినట్లు ఫెడరేషన్‌ ఆరోపించింది.

కాగా... ఈ వరుస ముద్దులకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో స్పెయిన్‌ లో తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. ఈ క్రమంలో... ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఆయనపై సస్పెషన్ వేటు పడింది!