Begin typing your search above and press return to search.

విమోచ‌న‌మైనా.. విలీన‌మైనా.. ఇది శుభ‌దినం: ప‌వ‌న్ హాట్ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   17 Sep 2022 12:30 PM GMT
విమోచ‌న‌మైనా.. విలీన‌మైనా.. ఇది శుభ‌దినం: ప‌వ‌న్ హాట్ కామెంట్స్‌!
X
నిజాం నిరంకుశ‌, నియంతృత్వ పాల‌న నుంచి తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబ‌ర్ 17న విమోచ‌న దినంగా బీజేపీ, విలీన దినంగా టీఆర్ఎస్ పిలుస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. నిజాం న‌వాబు నిరంకుశ పాల‌న నుంచి విముక్తి పొంది భార‌త‌దేశంలో విలీన‌మైన సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తోంది. మ‌రోవైపు కేసీఆర్ ప్ర‌భుత్వం తెలంగాణ విలీన దినోత్స‌వం నిర్వ‌హిస్తోంది. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్, బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి.

మ‌రోవైపు జన‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. సెప్టెంబర్ 17 నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

చైత‌న్యాల‌కు నెల‌వు.. విప్ల‌వాల‌కు కొలువు.. తెలంగాణ‌. ప్ర‌పంచంలోనే సాయుధ పోరాటానికి జ‌న్మనిచ్చిన పురిటిగ‌డ్డ‌.. తెలంగాణ‌. అటువంటి పుణ్య‌భూమికి స్వేచ్ఛ ల‌భించిన రోజు సెప్టెంబ‌ర్ 17. దీన్ని విమోచ‌న అనండి లేదా విలీనం అనండి.

ఏ పేరుతో పిలిచినా స‌రే.. ఈ రోజు మాత్రం చారిత్రాత్మ‌క శుభ‌దినం. ప్ర‌జ‌ల‌కు బానిస సంకెళ్లు తొల‌గిన మ‌ర‌పురాని దినం.. తెలంగాణ వాసులంద‌రికీ పండుగ దినం. ఈ శుభ త‌రుణంలో 75వ విమోచ‌న దినోత్స‌వం జ‌రుపుకుంటున్న శుభ త‌రుణాన తెలంగాణ బిడ్డ‌లంద‌రికీ నా ప‌క్షాన‌, జ‌న‌సేన పార్టీ ప‌క్షాన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను.

నిరంకుశ పాల‌కుల క‌బంధ హ‌స్తాల నుంచి.. తెలంగాణ త‌ల్లి విముక్తి కోసం అశువులు ధార‌బోసిన వీరుల‌కు ప్ర‌ణామాలు అర్పిస్తున్నాను. ఈ గ‌డ్డ‌లోని అణువ‌ణువ‌నా నిక్షిప్త‌మైన పోరాటత‌త్వం, అన్యాయాల‌పై గ‌ళ‌మెత్తే గుండె ధైర్య‌మే ఈ నేల‌కు స‌ర్వ‌దా ర‌క్ష‌.

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది క‌ళ‌క‌ళ‌లాడాల‌ని, ప్ర‌జ‌లు సుఖ‌శాంతులు, సంప‌ద‌ల‌తో విర‌జిల్లాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.