Begin typing your search above and press return to search.

గుడికట్టిన కేసీఆర్ భక్తుడు అమ్మేస్తున్నాడట?

By:  Tupaki Desk   |   21 Sep 2021 6:55 AM GMT
గుడికట్టిన కేసీఆర్ భక్తుడు అమ్మేస్తున్నాడట?
X
ప్రస్తుతం సమాజంలో జనాన్ని బాగా ఆకర్షించేవి రెండే రెండు. అవి పాలిటిక్స్.. రెండు సినిమాలు.. ఈ రెండు ఇండస్ట్రీల్లోని వారికి ప్రజాభిమానం బాగా ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులకు గుడులు కట్టేశారు. హీరోయిన్లకు కూడా గుడులు కట్టిన చరిత్ర అక్కడ ఉంది. ఇక తెలుగు నాట కూడా ఇప్పుడు బతికి ఉండగానే నేతలకు గుడులు కట్టేంత పిచ్చి ప్రేమ కొందరు నేతలకుంది.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై అమితమైన ప్రేమతో గుడి కట్టాడు ఓ టీఆర్ఎస్ అభిమాని. కేసీఆర్ గుడికట్టిన మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మాజీ టీఆర్ఎస్ నేత ఇప్పుడు తాను ఆశించింది నెరవేరకపోవడంతో అభిమానాన్ని చంపుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ గుడిని విగ్రహంతో సహా అమ్మేస్తానని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. నిజంగా ఆ అభిమానియే ఈ అమ్మకానికి రెడీ అయ్యాడా? లేక ప్రత్యర్థులు ఎవరైనా టీఆర్ఎస్ పై కోపంతో ఈ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారో తెలియదు కానీ.. ప్రస్తుతం అయితే ఈ పోస్ట్ హల్ చల్ చేస్తోంది.

మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్ అనే టీఆర్ఎస్ అభిమాని తన ఇంటి ముందు కేసీఆర్ గుడి నిర్మించాడు. అందులో కేసీఆర్ విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తున్నాడు. 2010 నుంచి టీఆర్ఎస్ లో గుండ రవీందర్ ఉన్నాడు. ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. తెలంగాణ వచ్చాక సుమారు రూ.3 లక్షలు ఖర్చు పెట్టి మరీ కేసీఆర్ కు గుడి కట్టాడు. అయితే టీఆర్ఎస్ నేతలు ఆయనను పట్టించుకోలేదని.. ఉన్న కేబుల్ ఆపరేటర్ ఉద్యోగం నుంచి తనను తొలగించారని.. ఉపాధి లేకపోవడంతో కేసీఆర్, కేటీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అతడు గుడిని, కేసీఆర్ విగ్రహాన్ని అమ్మడానికి రెడీ అయ్యాడని సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతోంది.

ఈ క్రమంలోనే కేసీఆర్ గుడి ముందే రవీందర్ నిరసన తెలిపాడు. ఓసారి టవర్ ఎక్కారు. ఎవరూ పట్టించుకోలేదు. చివరికి తాజాగా గుడిలో విగ్రహాలకు ముసుగులు వేసి పూజలు ఆపేసి బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో చేరిన రవీందర్ ఇప్పుడు కేసీఆర్ గుడి అవసరం లేదని.. అతడు సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతోంది.

కేసీఆర్ విగ్రహాన్ని కొనేందుకు ముందు వస్తున్నారని.. ఎవరూ రాకుంటే కూల్చివేస్తానని రవీందర్ చెబుతున్నాడట.. ఈ ఫేస్ బుక్ పోస్ట్ కింద చాలా మంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇదంతా నిజమా? ప్రత్యర్థులు సృష్టించారా? వాస్తవం ఎంత అనేది తేలాల్సి ఉంది.