ఇద్దరు ఫ్లాప్ స్టార్స్‌తో ప్రయోగం.. ఏకంగా 49 అవార్డులు
అప్పటికే ఫ్లాపుల్లో ఉన్న హీరో.. ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్.. ఆ ఇద్దరినీ కలిపి మేకర్స్ ఏకంగా 15 కోట్ల బడ్జెట్ ని రిస్క్ చేసారు.
అప్పటికే ఫ్లాపుల్లో ఉన్న హీరో.. ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్.. ఆ ఇద్దరినీ కలిపి మేకర్స్ ఏకంగా 15 కోట్ల బడ్జెట్ ని రిస్క్ చేసారు. ఎంపిక చేసుకున్న కథాంశం కూడా రిస్క్ తో కూడుకున్నదే. కనెక్టవ్వకపోతే ఫలితం తారుమారవుతుంది. కానీ కనెక్ట్ చేసారు. ప్రజల్ని ఎమోషన్స్ కి గురి చేయగలిగారు. ఈ సినిమా అనూహ్య విజయం సాధించడమే కాకుండా పెట్టిన పెట్టుబడికి ఏడు రెట్ల లాభం తెచ్చింది. పైగా ఈ సినిమాకి 49 అవార్డులు వరించాయి. ఇది నిజంగా ఆ ఏడాది సెన్సేషన్.
ఈ సినిమా మరేదో కాదు.. ఆదిత్య రాయ్ కపూర్- శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఆషిఖి 2. ఈ చిత్రం 2013 లో విడుదలైంది. అందులో లీడ్ పాత్రల కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుటైంది. థియేట్రికల్ గా భారీ వసూళ్లను సాధించడమేగాక, ఆ ఇద్దరు స్టార్ల కెరీర్ ని అమాంతం స్కైలోకి తీసుకెళ్లింది ఈ చిత్రం. నిజానికి `ఆషికి 2` కి ముందు ఆ ఇద్దరు స్టార్లు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
అప్పటికే లండన్ డ్రీమ్స్ చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఆదిత్య రాయ్ పెద్ద ఫ్లాప్ అందుకున్నాడు. సల్మాన్-అజయ్ దేవగన్ నటించిన ఈ సినిమాలో అతడు సహాయక పాత్రలో నటించాడు. ఆ తర్వాత యాక్షన్ రీప్లే, గుజారిష్ వంటి చిత్రాలలో నటించినా ఈ రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అయ్యాయి. అలాగే శ్రద్ధా కపూర్ `తీన్ పట్టి`(2010)తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. లవ్ కా ది ఎండ్ లో శ్రద్ధా కథానాయికగా నటించింది. కానీ ఇది బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. `ఆషిఖి 2`కి ముందు శ్రద్ధాపై ఫ్లాప్ నటి అన్న ముద్ర పడింది. అయితే ఆదిత్య, శ్రద్ధ జీవితాల్లో ఆషిఖి 2 విజయం అతి పెద్ద మలుపు. ఈ సినిమా నిర్మాతల జాతకాన్ని మార్చింది. నటీనటుల్లో ప్రతిభను బయటికి తీసింది.
ఇది మ్యూజికల్ హిట్ గా చరిత్ర సృష్టించింది. ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. దశాబ్ధం తర్వాత కూడా ఆషిఖి 2 నుంచి పాటల్ని అభిమానులు హమ్ చేస్తూనే ఉంటారు. కార్ లో, ప్రయాణాల్లో ఎప్పుడూ వినిపించే ఆహ్లాదకరమైన మ్యూజిక్ ఈ సినిమాకి కుదిరింది. అలాగే ఆషిఖి 2 కథాంశం ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రత్యేకతతో కూడుకున్నది. క్లబ్బుల్లో ఉపాధి కోసం పాడుకునే ఒక యువ గాయని సినీ కెరీర్ కోసం పాపులర్ గాయకుడు ఎలాంటి త్యాగం చేసాడు? గాయనితో ప్రేమలో పడ్డాక అతడు తాగుడుకు బానిసై ఏం కోల్పోయాడన్నది తెరపై ఎంతో ఎమోషనల్ గా ప్రదర్శించారు. క్లైమాక్స్ చాలా భావోద్వేగంగా ఉంది. పతాక సన్నివేశం ప్రజలతో కంటతడి పెట్టించింది.
`ఆషిఖి 2`కి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా ప్రపంచవ్యాప్తంగా 110కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి శ్రద్ధా కపూర్ ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది. ఐఎండిబి వివరాల ప్రకారం మ్యూజికల్ బ్లాక్ బస్టర్ `ఆషిఖి 2` ఏకంగా 49 అవార్డులను గెలుచుకుంది. ముఖ్యంగా ఈ సినిమా తర్వాత శ్రద్ధా క్రేజ్ చుక్కల్ని తాకింది. వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంది.