అఖిల్ కోసం ఈ టైటిల్ సరైనదేనా?
ఏదైనా సినిమాకి టైటిల్ అత్యంత కీలకమైనది. టైటిల్ సగం జనాల్ని థియేటర్లకు లాగుతుంది.;

ఏదైనా సినిమాకి టైటిల్ అత్యంత కీలకమైనది. టైటిల్ సగం జనాల్ని థియేటర్లకు లాగుతుంది. అది ఒక్కటీ కనెక్టయితే సగం సక్సెసైనట్టే. కానీ కొన్నిసార్లు టైటిల్ అనుకున్న విధంగా కుదరకపోతే దర్శకనిర్మాతలు మల్లగుల్లాలు పడాల్సి ఉంటుంది. అఖిల్ తదుపరి సినిమా టైటిల్ విషయంలో అలాంటి చిక్కులేవీ లేవు. దర్శకనిర్మాతలు చాలా పకడ్భందీగా ఎంపిక చేసారని తెలుస్తోంది.
అక్కినేని అఖిల్ నటిస్తున్న తదుపరి చిత్రానికి `లెనిన్` అనే టైటిల్ వినిపిస్తోంది. అయితే దీనిని చిత్రబృందం ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అంతేకాదు.. అఖిల్ సినిమాలో టైటిల్ సాంగ్ ని కూడా చిత్రబృందం తెరకెక్కించనుందని తెలుస్తోంది. ఈ పాట చిత్రీకరణ కోసం హైదరాబాద్ లో సెట్స్ కూడా వేస్తున్నారు. అంటే ఇప్పటికే టైటిల్ ఫిక్సయి ఉంది. దానిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. అఖిల్ ఈ పాటలో సరికొత్త మాస్ స్టెప్పులతో అదరగొడతాడని, మునుపెన్నడూ చూడని కొత్త యాంగిల్ అతడిలో కనిపిస్తుందని చెబుతున్నారు.
అక్కినేని అఖిల్ నటించిన సినిమాల టైటిల్స్ ని పరిశీలిస్తే... అఖిల్, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ .. ఇవన్నీ క్లాసీ టైటిల్స్. తదుపరి `లెనిన్` ని నిర్మాతలు అధికారికంగా ఫిక్సయితే ఇది కూడా ఇదే జాబితాలో చేరే అవకాశం ఉంది. నిజానికి లెనిన్ అనేది పవర్ ఫుల్ టైటిల్. చరిత్రలో `లెనిన్` అనే పేరుకు చాలా గొప్ప ప్రధాన్యత ఉంది. లెనిన్ అంటే కమ్యూనిజం, మార్క్సిజానికి సింబాలిక్. అందువల్ల ఈ టైటిల్ ఎంపిక ఆసక్తి రేకెత్తించేదే. కానీ అది కథకు లింకప్ అయి ఉండాలి.
ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ షెడ్యూల్ శరవేగంగా పూర్తవుతోంది. అఖిల్ పై ఈ సీన్స్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. అలాగే అఖిల్ పాత్ర గురించి అందిన లీకుల ప్రకారం.. అతడు చిత్తూరు యాసలో మాట్లాడతారని తెలిసింది. సీమ యాసతో పాటు, తిరుపతి లోకల్ కుర్రాడిలా అతడు మాట్లాడతాడట. శ్రీలీల ఇందులో కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా దసరా బరిలో ఈ సినిమాని రిలీజ్ చేస్తారని కూడా టాక్ వినిపిస్తోంది.