కంటెంట్ బాగాలేకపోతే మహేష్, చరణ్ మాత్రం ఏం చేస్తారు!

దీంతో ఈ సినిమా ఆమె పదేళ్ల కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

Update: 2024-10-15 07:35 GMT

బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జిగ్రా’. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. తొలి రోజే ప్లాప్ టాక్ తెచ్చుకొని, ఫస్ట్ వీకెండ్ కే బాక్సాఫీస్ వద్ద క్రాష్ అయిపోయింది. హిందీలోనే కాదు, విడుదలైన అన్ని భాషల్లోనూ అట్టర్ ప్లాప్ అయింది. ఫెస్టివల్ హాలిడేస్ కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయాయి. దీంతో ఈ సినిమా ఆమె పదేళ్ల కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఆలియా భట్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని, 'జిగ్రా' చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేసారు నిర్మాత కరణ్ జోహార్. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ లో రానా దగ్గుబాటి రిలీజ్ చేసారు. అయితే హిందీ మార్కెట్ లో ఫస్ట్ వీకెండ్ లో ₹16.64 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో ఈ సినిమా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మూడు రోజుల్లో కేవలం ₹18 లక్షలు మాత్రమే వసూలు చేసి, భారీ డిజాస్టర్ గా మారింది.

నిజానికి 'జిగ్రా' సినిమాని తెలుగులో బాగా ప్రమోట్ చేసారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. సూపర్‌ స్టార్ మహేష్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో తన మద్దతును తెలియజేశారు. ఇప్పటికే ఇది బ్లాక్‌ బస్టర్‌గా కనిపిస్తోంది అంటూ ఆలియాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. సమంత రూత్ ప్రభు, త్రివిక్రమ్ శ్రీనివాస్, రానా దగ్గుబాటి వంటి టాలీవుడ్ ప్రముఖులు ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్టులుగా వచ్చి ప్రమోషన్స్ లో భాగం అయ్యారు. రష్మిక మందన్న ఈ సినిమా చూసి ఇలాంటి టాలెంట్ చూపించినందుకు అలియాకి థ్యాంక్స్ అంటూ పోస్ట్ పెట్టింది.

మహేష్ బాబు, రామ్ చరణ్, సమంతా రూత్ ప్రభు, రష్మిక మందన్న, రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ లాంటి టాలీవుడ్ సెలబ్రిటీల సపోర్ట్ ఉన్నప్పటికీ, జిగ్రా చిత్రం తెలుగు మార్కెట్‌లో నిలబడలేకపోయింది. అలియా భట్ స్వయంగా హైదరాబాద్ వచ్చి తెలుగు పాటలు పాడి, డ్యాన్స్ చేసినప్పటికీ మన ప్రేక్షకులు పట్టించుకోలేదు. అందుకే ఈ సినిమా మినిమమ్ ఓపెనింగ్స్ కూడా సాధించలేకపోయింది. దీంతో తెలుగు స్టార్స్ అనవసరంగా ఇలాంటి ప్లాప్ సినిమా కోసం తమ స్టార్ పవర్‌ ని వృథా చేసుకున్నారనే కామెంట్స్ వస్తున్నాయి.

అయినా ఇక్కడ 'జిగ్రా' సినిమాని సపోర్ట్ చేసిన టాలీవుడ్ ప్రముఖులను నింధించడం సరికాదు. అలియా భట్ తో వారికున్న సాన్నిహిత్యం కారణంగా, ఆమె చిత్రానికి తెలుగులో తమవంతు మద్దతు ప్రకటించారు. కానీ కంటెంట్ నచ్చకపోవడం.. అంచనాలను అందుకోకపోవంలో విఫలం అవ్వడంతో జనాలు ఈ సినిమాని రిజెక్ట్ చేసారు. ప్రేక్షకులకు కంటెంట్ నచ్చకపోతే మహేష్ బాబు, రామ్ చరణ్ మాత్రం ఏం చేయగలరు చెప్పండి. కాబట్టి ఇక్కడ మన హీరోలు తమ స్టార్ పవర్‌ ని వేస్ట్ చేసుకున్నారని అనడంలో అర్థం లేదు. గతంలో మన హీరోల సపోర్ట్ తో వచ్చిన ఎన్నో హిందీ డబ్బింగ్ సినిమాలు తెలుగులో బాగా ఆడిన విషయాన్ని మర్చిపోతే ఎలా.

కాగా, తమ్ముడి కోసం అక్క చేసే పోరాటం నేపథ్యంలో 'జిగ్రా' సినిమా తెరకెక్కింది. ఇందులో అలియా భట్, వేదాంగ్‌ రైనా అక్కా తమ్ముళ్లుగా నటించగా.. మనోజ్‌ పవా, రాహుల్‌ రవీంద్రన్‌ కీలక పాత్రలు పోషించారు. వాసన్‌ బాలా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కరణ్ జోహార్ నిర్మించారు. ఇటీవల నటి దివ్యఖోస్లా ఈ మూవీకి ఫేక్‌ కలెక్షన్స్‌ అనౌన్స్‌ చేస్తున్నారంటూ కామెంట్స్ చేయడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.

Tags:    

Similar News