అమీర్ ఖాన్ మైండ్‌లో 'మ‌హాభార‌తం' స‌జీవంగా

ఇంత‌లోనే ఇప్పుడు త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం'పై పని ప్రారంభించానని అమీర్ ఖాన్ వెల్లడించాడు. గతంలోనే అత‌డు 'మహాభారతం'ను పెద్ద తెరపైకి తేవాల‌ని విఫ‌ల‌య‌త్నం చేసారు.;

Update: 2025-03-14 03:00 GMT

మ‌హాభార‌త క‌థ‌ను ఐదు సినిమాలుగా రూపొందించేందుకు అమీర్ ఖాన్ విశ్వ ప్ర‌య‌త్నం చేసాడు. రిల‌యన్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ 1000 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాల‌ను నిర్మించేందుకు ముందుకు వ‌చ్చింది. కానీ నాలుగేళ్ల క్రితం సాగిన ఈ ప్ర‌య‌త్నం స‌ఫ‌లం కాలేదు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి కూడా మ‌హాభార‌తంపై సినిమా తీస్తాన‌ని అన్నారు. కానీ వ‌రుస‌గా టాలీవుడ్ అగ్ర హీరోల‌తో సినిమాలు చేస్తూ, దానిపై దృష్టి సారించ‌లేదు.

ఇంత‌లోనే ఇప్పుడు త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ లింగు స్వామి తాను మ‌హాభారతంను త‌న‌దైన శైలిలో పూర్తి వినోదాత్మ‌క ప్రాజెక్టుగా రూపొందించేందుకు రెడీ అయ్యారు. ఇంత‌కుముందే ఈ సినిమా గురించి లింగుస్వామి అధికారికంగా ప్ర‌కటించారు. రెండు భాగాలుగా మ‌హాభార‌తంలోని ఒక కీల‌క ఘ‌ట్టాన్ని తెర‌పై చూపించ‌నున్నాడు లింగుస్వామి.

ఇంత‌లోనే ఇప్పుడు త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం'పై పని ప్రారంభించానని అమీర్ ఖాన్ వెల్లడించాడు. గతంలోనే అత‌డు 'మహాభారతం'ను పెద్ద తెరపైకి తేవాల‌ని విఫ‌ల‌య‌త్నం చేసారు. కానీ ఆశించిన‌ది జ‌ర‌గ‌లేదు. అందుకే ఈసారి గ‌ట్టి ప‌ట్టుద‌ల‌గా ఉన్నార‌ని తెలుస్తోంది. తన 60వ పుట్టినరోజుకు ముందు అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఒక పెద్ద అప్‌డేట్‌ను అందించారు. 'మ‌హాభార‌తం'పై పని ప్రారంభించానని ఆయన వెల్లడించారు. 13 మార్చి 2025న అమీర్ ఖాన్ ముంబై ఫోటోగ్రాఫ‌ర్ల‌తో సమావేశమయ్యారు. వారితో పార్టీలో తన 60వ పుట్టినరోజును ముందుగానే జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 'మహాభారతం' తీస్తున్నారా? అని అమీర్‌ను అడిగారు. దీనికి ప్రతిస్పందనగా అత‌డు ఇలా వ్యాఖ్యానించారు. నేను ఇప్పుడే ప్రారంభించాను. ర‌చన కోసం బృందాన్ని ఒకచోట చేర్చి ఇప్పుడే ప‌ని ప్రారంభించాను... అని అన్నారు.

రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్‌ను ఆశించవచ్చా? అని అడిగినప్పుడు, అది మొదటి సంవత్సరం ప‌ని ఎలా ఉంటుందో దానిపై ఆధారపడి ఉంటుందని అమీర్ ఖాన్ అన్నారు. అంటే కాస్టింగ్ ఎంపిక‌లు, బ‌డ్జెట్ స‌మీక‌ర‌ణ‌ కీల‌కం అని అత‌డు అభిప్రాయ‌ప‌డ్డాడు.

Tags:    

Similar News