సక్సెస్ కోసం తండ్రి బాటలో నడుస్తున్న యువ హీరో..!

Update: 2021-07-17 05:58 GMT
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆది సాయికుమార్.. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ట్రై చేస్తున్నాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయిన యువ హీరో.. తన తండ్రి రూట్ లో నడవడానికి ఫిక్స్ అయ్యాడు.

పోలీస్ పాత్రలకు సాయి కుమార్ పెట్టింది పేరు. 'కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతి రూపాలైతే.. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్‌' అంటూ ఖాకీ డ్రెస్ వేసుకొని ఆయన ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకులని అలరించారు. ఇప్పుడు తనయుడు ఆది సాయికుమార్‌ తండ్రిలాగే ఖాకీ డ్రెస్ ధరించాడు. తాను నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''అమరన్‌ ఇన్‌ ది సిటీ - చాప్టర్‌ 1'' చిత్రం కోసం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో లాఠీ ఝుళిపించడానికి రెడీ అయ్యాడు ఆది.

ఎస్‌.బాలవీర్‌ తెరకెక్కిస్తున్న ''అమరన్‌ ది సిటీ చాప్టర్‌ 1'' చిత్రాన్ని ఎస్‌వీఆర్‌ నిర్మిస్తున్నారు. ఇందులో ఆది సాయి కుమార్ సరసన అవికా గోర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైంది. దాదాపు రెండేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి పక్కా ప్రణాళికతో చిత్రీకరణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారీ బడ్జెట్ తో నిర్మించిన పోలీస్ స్టేషన్ సెట్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

''అమరన్‌ ది సిటీ చాప్టర్‌ 1'' సినిమా ఆది సాయికుమార్‌ కెరీర్‌ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రంగా నిలవనుంది. పోలీస్ ఆఫీసర్ గా ఆది సరికొత్త లుక్‌ లో సందడి చేయనున్నారు. వెండితెరపై ఇంతకు ముందు రాని కథా నేపథ్యంలో.. ఇదివరకెప్పుడూ చూడని రీతిలో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో గ్రాఫిక్ వర్క్ కు కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

'అమరన్‌' చిత్రంలో సాయి కుమార్ - ఆదిత్య ఓం - కృష్ణుడు - మనోజ్‌ నందన్‌ - వీర శంకర్ - అయన్ - శృతి - రోషన్ - మధు మణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్.ఆర్ విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సక్సెస్ కోసం తండ్రి బాటలో ఖాకీ దుస్తులు ధరిస్తున్న ఆది సాయి కుమార్ కు ఈ సినిమా సూపర్ హిట్ అందిస్తుందేమో చూడాలి.


Tags:    

Similar News