160 కోట్ల షేర్.. 140కోట్ల షేర్.. జీఎస్టీ క‌ట్టారా?

Update: 2020-03-15 04:31 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు`.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన‌ `అల వైకుంఠ‌పుర‌ములో` రిలీజ్ వార్ గురించి తెలిసిందే. సంక్రాంతి బ‌రిలో నువ్వా నేనా? అంటూ పోటీప‌డిన ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ సాధించాయి. అయితే రేస్ లో బ‌న్నీదే  పై చేయి అయ్యింది. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం వీక్షించేందుకు ఫ్యామిలీ ఆడియెన్ రిపీటెడ్ గా థియేట‌ర్ల‌కు రావ‌డంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 160 కోట్ల షేర్ వసూలు చేసింది. బ‌న్ని కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.

అయితే స‌రిలేరు నీకెవ్వ‌రు సీనేంటి? అంటే.. ఈ సినిమా కూడా 100 కోట్ల షేర్ మార్క్ ని అధిగ‌మించింది. యావ‌రేజ్ కంటెంట్ అంటూ క్రిటిక్స్ తీవ్రంగా విమ‌ర్శించినా.. పండ‌గ సెల‌వులు క‌లిసొచ్చి ఇంత‌టి విజ‌యం సాధించింద‌న్న విశ్లేష‌ణా సాగింది. అయితే స‌రిలేరు పై అల డామినేష‌న్ గురించి ఆ చిత్ర‌బృందాన్ని ప్ర‌శ్నిస్తే ఏమ‌ని బ‌దులిస్తోంది? అంటే.. ఇప్ప‌టికీ ఆ బింకం ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

``పండ‌గ చిత్రాల్లో కంటెంట్ ప‌రంగా మేమే బెస్ట్. కానీ అల వైకుంఠ‌పుర‌ములో మూవీ.. ఫ్యామిలీ ఆడియెన్ సినిమాగా ప్ర‌మోటైంది. అందుకే ఒక అడుగు ముందుకు దూసుకెళ్లింది`` అని చెబుతుండ‌డం విశేషం. అంటే ఇప్ప‌టికీ అల వైకుంఠ‌పుర‌ములో డామినేష‌న్ ని అంగీక‌రించ‌లేని స‌న్నివేశం అటువైపు ఉంది. ఇక బ‌న్ని చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఫుల్ ర‌న్ లో 160 కోట్ల షేర్ వ‌సూలు చేస్తే.. స‌రిలేరు నీకెవ్వ‌రు 138 కోట్ల షేర్ వ‌సూలు చేసింద‌ని ఆ చిత్ర‌బృందం చెబుతోంది. ఆ మేర‌కు జీఎస్టీ చెల్లింపులు చేశార‌ని కూడా చెబుతున్నారు. అయితే ఇందులో నిజం ఎంత‌? అన్న‌ది చూడాలి.

ఇక ఇటీవ‌లి కాలంలో జీఎస్టీ అధికారులు సినిమా వాళ్ల‌ను వెంటాడి వేటాడుతున్న సంగ‌తి తెలిసిందే. ముక్కు పిండి మ‌రీ ప‌న్ను వ‌సూలు చేస్తున్నారు. త‌ప్పుడు లెక్క‌లు చెబితే తాట తీస్తున్నారు. మ‌రి అల టీమ్ 160 కోట్ల‌కు.. స‌రిలేరు టీమ్ 140 కోట్ల‌కు జీఎస్టీ చెల్లింపులు స‌వ్యంగానే చేశారా? అంటూ ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.




Tags:    

Similar News