రాబ్తా రిలీజ్.. అల్లు ఏమన్నారంటే..

Update: 2017-05-26 04:35 GMT
ఆన్ స్క్రీన్ ధోనీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. 1నేనొక్కడినే బ్యూటీ కృతి సనోన్ జంటగా నటించిన  బాలీవుడ్ మూవీ రాబ్తా. జూన్ 9న ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ఇప్పటికే ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది యూనిట్. కానీ ఈ సినిమాను టాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'మగధీర'కు అనధికారిక రీమేక్ అనే టాక్ ముందు నుంచి వినిపిస్తోంది.

రాబ్తా టీజర్.. ట్రైలర్ లు చూశాక ఈ అనుమానాలు ఇంకా బలపడ్డాయి. దీంతో రాబ్తాపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. వీటిని మగధీర నిర్మాత.. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ధృవీకరించారు. రాబ్తా మూవీపై కోర్టును ఆశ్రయించిన మాట వాస్తవమేనని చెప్పారాయన. 'హిందీ మూవీ రాబ్తా చిత్రానికి ట్రైలర్.. పబ్లిసిటీకి ఉపయోగిస్తున్న మెటీరియల్ ను గమనిస్తే.. మగధీరను పోలినట్లుగా ఉండడంతో.. కాపీరైట్ చట్టం ప్రకారం ఈ చిత్రంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. కోర్టును ఆశ్రయించాం. ఈ మూవీ విడుదలపై ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాల్సిందిగా కోరాం' అని స్టేట్మెంట్ ఇచ్చారు అల్లు అరవింద్.

'రాబ్తా నిర్మాతలకు హైద్రాబాద్ సివిల్ కోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. రాబ్తా విడుదలపై నిర్ణయం తీసుకునేందుకు జూన్ 1న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది' అని చెప్పారు అల్లు అరవింద్. ట్రైలర్ ను చూసి కాపీ అనుకోవడం కరెక్ట్ కాదని ఇప్పటికే హీరో సుశాంత్ సింగ్ చెప్పాడు కానీ.. ఇప్పుడు విషయం కోర్టుకు చేరడంతో.. తమ చిత్రం మగధీరకు కాపీ కాదని నిరూపించుకోవాల్సిన తప్పనిసరి అవసరం ఏర్పడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News