సిగరెట్టే రిలేషన్ అంటున్న అవసరాల

Update: 2016-09-18 05:20 GMT
జ్యో అచ్యుతానంద.. ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశమవుతున్న సినిమా. బలమైన కథ.. అర్థవంతమైన పాత్రలు.. ఆహ్లాదకరమైన కథనం.. చక్కటి మాటలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ చిత్రంలో. అవసరాల శ్రీనివాస్ రైటింగ్ టాలెంట్.. అతడి దర్శకత్వ శైలి గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అన్నదమ్ముల పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు.. వాళ్ల మధ్య బాండింగ్ ను చూపించిన తీరు ప్రేక్షకులకు భలేగా నచ్చేసింది.

ఐతే సినిమాలో కొన్ని లోపాల్ని కూడా జనాలు ఎత్తి చూపుతున్నారు. చివర్లో అన్నదమ్ముల నిగూఢంగా ఉన్న ప్రేమను బయటికి తీసుకొచ్చిన తీరు బాగానే ఉంది కానీ.. ముందు నుంచి వారిని శత్రువుల్లాగా చూపించడం.. ఇద్దరి మధ్య ప్రేమను అలా దాచి ఉంచేయడం గురించి కొందరు కంప్లైంట్ చేస్తున్నారు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు అవసరాల. అన్నదమ్ములిద్దరి బంధానికి సిగరెట్టే వారధి అన్నాడు అవసరాల. అదే వాళ్ల రిలేషన్ అని చెప్పాడు అవసరాల.

‘‘అన్నదమ్ములంటే రాముడు.. లక్ష్మణుడిలా ఉండాల్సిన పని లేదు. వాళ్లిద్దరి మధ్య ప్రేమానురాగాల్ని ఓపెన్ గా చూపించాల్సిన అవసరం లేదు. దాన్ని సూటిగా చెప్పాలని అనుకోలేదు. మరోలా రెప్రజెంట్ చేయాలని అనుకున్నా. కొంచెం తమాషాగా అనిపించినా.. సిగరెట్టే అన్నదమ్ములిద్దరి మధ్య రిలేషన్ ను ప్రతిబింబించేలా చేస్తుంది. సినిమాలో గమనించారంటే ఇద్దరూ కలిసే ఎప్పుడూ సిగరెట్ తాగుతారు. సిగరెట్ పంచుకుంటూ ఉంటారు. ఇక్కడే వాళ్లిద్దరూ ఎంత క్లోజ్ అనేదే అర్థమవుతుంది. మామూలుగా మన మధ్య కూడా సిగరెట్ స్నేహితులు చాలామంది ఉంటారు. ఇక తమ్ముడు ఆడే టెన్నిస్ అన్న ఆడినపుడు.. అన్నయ్య గీసే బొమ్మల్ని తమ్ముడు గీసినపుడు ఒకరి గొప్పదనం ఇంకొకరికి తెలిసేలా సన్నివేశాలు పెట్టాను’’ అని అవసరాల చెప్పాడు.
Tags:    

Similar News