స్పెషల్‌ స్టోరి: బాహుబలి - ది రికార్డ్‌ మేకర్‌

Update: 2015-07-25 04:48 GMT
ఇది జస్ట్‌ బిగినింగ్‌ మాత్రమే. ఇంకా కంక్లూజన్‌ ఉంది. అబ్బే ఇదంతా బాహబలి పార్టు 2 గురించి అనుకుంటున్నారా.. లేదండీ బాబూ.. ఇదంతా కేవలం బాహుబలి: ది బిగినింగ్‌ బ్రేక్‌ చేస్తూ కొత్తగా క్రియేట్‌ చేస్తున్న రికార్డుల గురించి. ఈ రికార్డుల్లో కిక్‌ ఏ రేంజులో ఉందో తెలియాలంటే.. 400 కోట్ల గ్రాస్‌ మార్కుకు దగ్గర పడుతున్న ఈ సినిమా రెండు వారాల కలెక్షన్లను ఓ మారు చూడాల్సిందే.

రాజమౌళి మార్కు టేకింగ్‌... ఊపిరాడనివ్వని విజువల్స్‌... బాహుబలి గా ప్రభాస్‌, బల్లాలదేవగా రానా, అదిరిపోయే మాహిష్మతి, అదరగొట్టిన యుద్ద సన్నివేశాలు.. గ్లామర్‌ కావల్సినంత, ఎమోషన్‌ ఉండాల్సినంత, నెరేషన్‌ వెంట్రులు నిక్కపొడిచేటంత.. ఇవన్నీ భారీ వాటాలతో కలసి రాజమౌళి కంటి నుండి జారి క్రింద పడితే.. ఆ రేణువే బాహుబలి. బాక్సాఫీసును సునామీ తో ముంచెత్తి, సుడిగుండంలా తిప్పేస్తోంది. తెలుగు సినిమా స్థాయిని పెంచి, భారతీయ సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పిన బాహుబలి రెండు వారాల్లో ఎంత వెనకేసిందో తెలుసా? అక్షరాలా మూడు వందల తొంభై కోట్లు 'గ్రాస్‌'. ఈ శుక్రవారం ముగిసేసరికి మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కలుపుకొని 119.5 కోట్లు వసూలు చేసింది బాహుబలి. ఇక కర్ణాటకలో ఓ 51 కోట్లు ఉఫ్ఫంటూ ఊదేసింది. మరి తమిళ వెర్షన్‌ ఏమైనా తక్కువ తిందా.. అక్కడ కూడా 50 కోట్ల మోత మోగించింది. అసలే చిన్న ఏరియా, మన కేరళలో ఎలా ఉందంటారూ? తక్కువగా అంచనా వేసినట్లున్నారే.. అక్కడ కూడా 8 కోట్లు వసూలు చేసింది. హిందీ వర్షెన్‌, ఇండియాలోని మిగిలిన చోట్ల రిలీజైన తెలుగు వర్షెన్‌ కలుపుకుంటే షుమారు 103 కోట్లు కలెక్ట్‌ చేసేశారు బాహుబలులు. మొత్తంగా ఇండియాలోని రెండు వారాల 'గ్రాస్‌' 331.5 కోట్లు. దీనికి అమెరికా, కెనడా వంటి దేశాల్లో వచ్చిన 44.2 కోట్లు, మిగిలిన దేశాల్లో వసూలు చేసిన 15.5 కోట్లు కలిపితే, మొత్తంగా వరల్డ్‌ వైడ్‌ బాహుబలి ''గ్రాస్‌'' కలెక్షన్‌ 391.2 కోట్లు వసూలు చేసింది. అంటే డిస్ట్రిబ్యూటర్లకు షుమారు 218 కోట్లు ''షేర్‌'' వచ్చుంటుందని ఒక అంచనా. ఇక ఈ కలెక్షన్లతో బాహబులి అమ్ములపొదిలో చేరిన ఆ అమూల్యమైన రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఇప్పటికే సౌంత్‌ ఇండియా చరిత్రలోనే టాప్‌ వసూళ్ళ ను నెలకొల్పిన సినిమాగా బాహుబలి హిస్టరీ రీ రైట్‌ చేసింది. 84 ఏళ్ళ దక్షిణాది సినిమాల చరిత్రలో ఆల్‌ టైమ్‌ నెం.1 బ్లాక్‌ బస్టర్‌ మన బాహుబలి. అసలు మన సౌత్‌ సంగతి పక్కనెట్టండి.. కేవలం భారతదేశంలో ఈ సినిమా వసూలు చేసిన డబ్బుల నుండి డిస్ట్రిబ్యూటర్‌ షేర్‌ చూసుకుంటే.. బాహుబలి నెం.1. ఎస్‌.. ఇట్‌ ఈజ్‌ ''నెం.1''. ఇండియాలో వసూలైన 331.5 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్లో షుమారు 180.35 కోట్లు వాటాను పంపిణీదారులు తీసుకెళ్తారు. ఇప్పటివరకు మన దేశంలో డిస్ట్రిబ్యూటర్లు తీసుకెళ్ళిన అత్యధిక మొత్తం, అమీర్‌ ఖాన్‌ రాజు హిరాణీల ''పీకె'' సినిమాకు గాను 175 కోట్ల రూపాయలు. ఆ లెక్కన చూస్తే ఇక ఇండియాలో ఆల్‌ టైమ్‌ టాప్‌ ''షేర్‌'' వసూళ్ళు బాహుబలి పేరు మీద రాసేసినట్లే. పీకె తరువాత పొజిషన్లలో నిలిచిన ''ధూమ్‌ 3'' 149 కోట్లు షేర్‌, ''రోబో'' 129 కోట్లు సంపాదించుకున్నాయి. నిజానికి పీకె, ధూమ్‌ 3, రోబో సినిమాలు లైఫ్‌ టైమ్‌ ఆడేశాక లెక్కెట్టిన వసూళ్ళ తాలూక షేర్‌ ఎమౌంట్‌ అది. బాహుబలి రెండు వారాల్లోనే వీటన్నింటినీ కొట్టేయడం అమోఘం. ఖచ్చితంగా సినిమా ఇంకో రెండు వారాలు ఆడేలా కనిపిస్తోంది. అంటూ షుమారు ఓ 450 కోట్లు గ్రాస్‌ వసూలు చేయడం ఖాయమేమో.

ఒకవేళ ప్రపంచవ్యాప్త ''గ్రాస్‌'' వసూళ్ళను కన్సిడర్‌ చేస్తే మాత్రం.. బాహుబలి 5వ స్థానంలో ఉన్నట్లు. ఆ ముందు నాలుగు స్థానాల్లో ''పీకె'' (730 కోట్లు), ''ధూమ్‌ 3'' (540 కోట్లు), ''3 ఈడియట్స్‌'' (395 కోట్లు), ''చెన్నయ్‌ ఎక్స్‌ ప్రెస్‌'' (393 కోట్లు) ఉన్నాయి. అయితే ఆఖరి రెండింటినీ బాహుబలి ఓ రెండు రోజుల్లో కొట్టేస్తుంది కాని, ధూమ్‌ 3 కలెక్షన్లు అందుకోవడం మాత్రం కాస్త ఊపిరాడని విన్యాసమే. ఒకవేళ ఆ సినిమాను అందుకుంటే మాత్రం అద్భుతమే. అయితే ఈలోగా బాహుబలి కూడా ఫ్రెంచ్‌, ఛైనీస్‌, ఇటాలియన్‌, పోలిష్‌ మొదలైన దేశాల్లో రిలీజ్‌ అయ్యిందనుకోండి.. ఆ రికార్డుల లెక్కలు అంకెలకే అంతుపట్టకుండా ఉండొచ్చు. గాట్టిగా ట్రై చేస్తే ''పీకె'' వరల్డ్‌ వైడ్‌ గ్రాస్‌ ను కూడా దాటేయవచ్చు. ఇక ఇవే వరల్డ్‌ వైడ్‌ ఇండియన్‌ సినిమా గ్రాస్‌ కలెక్షన్లకు మనం ఓసారి డిస్ట్రిబ్యూటర్‌ షేర్‌ను లెక్కకడితే మాత్రం, బాహుబలి 3వ స్థానంలో ఉంది. పీకె సినిమాకు 320 కోట్ల ''షేర్‌'' వస్తే, ధూమ్‌ 3 సినిమాకు 245 కోట్లు, రెండు వారాల తరువాత బాహుబలి సినిమాకు 217.9 కోట్లు వచ్చాయి. త్వరలో ధూమ్‌ 3 షేర్‌ ను దాటేసి సెకండ్‌ పొజిషన్‌ లోకి వెళ్లడం మాత్రం తప్పకుండా జరుగుతుంది.

ఓసారి ఈ రికార్డులన్నీ సింపుల్‌ గా తిరగేస్తే.. ప్రపంచవ్యాప్తంగా 2 వారాల సక్సెస్‌ ఫుల్‌ రన్‌ తరువాత.. బాహుబలి 391.2 కోట్ల రూపాయల ''గ్రాస్‌'' వసూళ్ళతో దూసుకుపోతూ.. 84 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో నెం.1 బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం తెలుగు వర్షెన్‌ తోనే 149 కోట్లు ''షేర్‌'' వసూలు చేసి అత్తారింటికి దారేది ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్‌ కు డబుల్‌ వసూలు చేసింది. ఇంకా ఇండియా వైడ్‌ ''షేర్‌'' చూసుకుంటే ఇప్పటికే నెం.1 స్థానంలో నిలిచిన బాహుబలి, వరల్డ్‌ వైడ్‌ ''షేర్‌''లో 3వ స్థానం, వరల్డ్‌ వైడ్‌ ''గ్రాస్‌''లో 5వ స్థానంలో నిలిచింది. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి.. సినిమా ఇంకో రెండు వారాలు ఆడితే, మరికొన్ని టాప్‌ రికార్డులు కూడా తుడిచిపెట్టుకుపోతాయ్‌.

రికార్డ్‌ మేకర్‌ బాహుబలి.. తుజే సలామ్‌!!!
Tags:    

Similar News