కేసీఆర్ ప్రతిపాదనకు నో చెప్పిన బడా నిర్మాత

Update: 2018-07-06 07:30 GMT
మద్రాసులో ఉన్న తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్  తరలించడం కోసం సినీ స్టూడియోలకు నాటి ప్రభుత్వాలు విరివిగా భూములు కేటాయించాయి. 1983 నుంచి పలువురు సినీ పెద్దలు స్టూడియోలను స్థాపించడం మొదలుపెట్టారు. కానీ మొట్టమొదట వచ్చింది మాత్రం రామానాయుడు - అక్కినేని నాగేశ్వరరావులే.. వీరిద్దరూ రామానాయుడు స్టూడియోస్ - అన్నపూర్ణ స్టూడియోలు స్థాపించి హైదరాబాద్ లో తెలుగు సినిమా పరిశ్రమ ఎదగడానికి దోహదపడ్డారు. ఆ తర్వాత చాలా మంది వచ్చి స్టూడియోలను నిర్మించారు.

తాజాగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ ఖరీదైన - విలువైన స్టూడియోల స్థలాలను తీసుకొని.. నగర శివారుల్లో  వారికి సకల సదుపాయాలతో కొత్త స్టూడియోలు నిర్మిస్తామని.. ఆ స్థలాలను తమకు ఇవ్వాలని సినీ పెద్దలకు ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది. స్టూడియో స్థలాలను ప్రభుత్వ అవసరాలతోపాటు కమర్షియల్ అవసరాలకు వాడాలని కేసీఆర్ భావిస్తున్నారు.

అయితే కేసీఆర్ చేసిన ఈ ప్రతిపాదనకు ఓ బడా నిర్మాత నో చెప్పాడట.. తన తండ్రి ఎంతో సెంటిమెంట్ తో ఈ స్టూడియో నిర్మించాడని.. టాలీవుడ్ ను హైదరాబాద్ తీసుకురావడంలో ఆయన కృషి వెలకట్టలేనిదని.. ఆయన జ్ఞాపకార్థం ఉన్న స్టూడియోను ప్రభుత్వానికి తిరిగిచ్చేది లేదని కేసీఆర్ కు స్పష్టం చేసినట్టు తెలిసింది.

అయినా కొత్త స్టూడియోను నిర్మించడం.. అందులో మెరుగైన వసతులు కల్పించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత తేలికైన పని కాదని అభిప్రాయపడ్డాడట.. తమ తండ్రి జ్ఞాపకార్థం ఉన్న స్టూడియోను  మినహాయించాలని ప్రభుత్వ వర్గాలను కోరినట్టు తెలిసింది. 
Tags:    

Similar News