స్టార్ హీరో వార‌సుడిని ప‌ట్టించుకోని బాలీవుడ్?

Update: 2022-11-26 01:30 GMT
బాలీవుడ్ లో వ‌రుస‌గా న‌ట‌వార‌సులు ఆరంగేట్రం చేస్తున్నారు. అయితే అక్క‌డ క‌ర‌ణ్ జోహార్ .. స‌ల్మాన్ ఖాన్ .. అమీర్ ఖాన్ లాంటి బిగ్ షాట్స్ ఎవ‌రైనా న‌వ‌త‌రం స్టార్ల‌ను ప‌రిచ‌యం చేస్తే ఉండే మైలేజ్ వేరు. డెబ్యూ తార‌ల‌ కెరీర్ ఆద్యంతం ఏదో ఒక స‌హాయం చేస్తూ ప‌రిశ్ర‌మ‌లో నిలబెడ‌తారు. క‌ష్టంలోను అండ‌గా నిలుస్తారు. అయితే ఇలాంటి ఒక సెక్ష‌న్ ని కంగ‌న లాంటి ఔట్ సైడ‌ర్ సినీమాఫియా అంటూ నిల‌దీస్తోంది.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి అగ్ర న‌టుడిగా ఎదిగాడు ఇర్ఫాన్ ఖాన్. అత‌డు కొన్నాళ్ల క్రితం క్యాన్స‌ర్ తో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు దివంగ‌త న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ న‌ట‌వార‌సుడు వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. బాలీవుడ్ లో అత‌డి ఆరంగేట్రంపై ఇర్ఫాన్ ఫ్యాన్స్ ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. చూస్తుంటే న‌ట‌వార‌సుడు బాబిల్ ఆరంగేట్రానికి ఫ్యాన్స్ హంగామా త‌ప్ప బాలీవుడ్ సినీపెద్ద‌ల నుంచి అండ‌దండ‌లు ల‌భించిన‌ట్టు లేవు. అత‌డి ఆరంగేట్ర చిత్రానికి ప్ర‌చారం అంతంత మాత్రంగానే ఉంది.

అయితే తాజా ఇంట‌ర్వ్యూలో బాబిల్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు ఆస‌క్తిని క‌లిగించాయి. త‌న‌కు అరంగేట్రం-లాంచ్ వంటి పదాలు న‌చ్చ‌వ‌ని ఈ యువహీరో అన్నాడు. ఎందుకంటే అలాంటి ట్యాగ్ లు న‌ట‌న‌పై నుండి దృష్టిని దూరం చేస్తాయి.. అని సూటిగా చెప్పాడు. ఈ యువ ప్ర‌తిభావంతుడు దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కి పెద్ద‌ కుమారుడు. ఇర్ఫాన్ లానే రాయ‌ల్ గా మాట్లాడుతూ ఆక‌ర్షిస్తున్నాడు. బాబిల్ ఖాన్ తన మొదటి ప్రాజెక్ట్ ఖాలాతో బాలీవుడ్ లో ప్రవేశిస్తున్నాడు. అత‌డి అరంగేట్రం కోసం చాలా మంది ఆస‌క్తిగా ఎదురుచూస్తుండగా తాజా వ్యాఖ్య‌లు విస్మ‌యం క‌లిగించాయి. అరంగేట్రం అనే పదానికి తాను పెద్ద అభిమాని కాదని బాబిల్ ఎత్తి చూపాడు. తాను స్టార్ కిడ్ కాకపోతే తన గురించి ఎవరూ పట్టించుకోరని కూడా అన్నాడు.

అన్వితా దత్ దర్శకత్వం వహించిన చిత్రం ఖాలా. ఇందులో బాబిల్ స‌హా త్రిప్తి డిమ్రీ - స్వస్తిక ముఖర్జీ తార‌లుగా నటించారు. కోల్ కతాలో 1940ల నేపథ్యంలో క‌థ సాగుతుంది. నాటి కాలంలో ఆరంగేట్ర‌ గాయని ఆమె తల్లి మధ్య సంక్లిష్టమైన సంబంధాన్ని ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రంలో బాబిల్ త్రిప్తికి ప్రత్యర్థిగా కనిపిస్తాడు. ఇది కర్నేష్ శర్మ  క్లీన్ స్లేట్ ఫిలింజ్ ప‌తాకంపై తెర‌కెక్కింది. డిసెంబర్ 1 న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

బాబిల్ ఖాన్ సినిమా విడుదలకు ముందు తన ఆలోచనలను  మీడియాతో షేర్ చేసాడు. బాబిల్ మాట్లాడుతూ-"నేను ఇర్ఫాన్ ఖాన్ కొడుకు కాకపోతే నా అరంగేట్రం గురించి ఎవరూ పట్టించుకోరు. నేను సినిమాల్లోకి ప్రవేశించడానికి.. ఆడిషన్ చేయడానికి .. బహుశా ఒక పాత్రను పొందడానికి ప్రయత్నిస్తున్న నటుడిగా మాత్ర‌మే ఉండేవాడిని. వారసత్వంతో గుర్తింపు పొందడం కంటే మ‌న‌ పని ద్వారా గుర్తింపు పొందడం చాలా గొప్పది. అందుకే అరంగేట్రం-లాంచ్ అనే పదాలు నాకు న‌చ్చ‌వు. న‌ట‌వార‌సుడు అనే ప్ర‌చారం ఎల్లప్పుడూ కథ - సినిమా కంటే గొప్పగా హైలైట్ అవుతుంది. పైగా న‌ట‌న నుంచి డైవ‌ర్ట్ అవుతాము" అని అన్నాడు.

నేను నా తల్లి పెంపకాన్ని గౌరవించాలనుకున్నాను. నాకు సినిమా ఆఫ‌ర్ వచ్చింది. స్త్రీ ప్రధాన చిత్రంలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంద‌ని కూడా బాబిల్ అన్నారు. "డెబ్యూ అంటూ న‌న్ను నేను అస్సలు తేలికగా భావించడం లేదు. అది నాకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఒక కళాకారుడిని అలానే ఎందుకు చూడాలి? ఇది నాకు కొంచెం బాధ కలిగిస్తుంది" అని కూడా అన్నాడు.

న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ తో రెండేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇర్ఫాన్ ఖాన్ 2020 ఏప్రిల్ లో మరణించాడు. బాబిల్ తన తండ్రితో పాత జ్ఞాపకాలను సోషల్ మీడియాల్లో అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటారు. బాబిల్ కి అయాన్ ఖాన్ అనే సోద‌రుడు ఉన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News