చ‌ల‌ప‌తిరావు ఇప్పుడు యాంక‌ర్ మీద ప‌డ్డాడు

Update: 2017-05-23 12:09 GMT
సినిమా ఆడియో ఫంక్ష‌న్ల‌లో ఈ మ‌ధ్య‌న హాస్యం హ‌ద్దులు దాటుతోంది. వ‌చ్చిన వారిని ఆక‌ర్షించాల‌ని.. ఆక‌ట్టుకునాల‌నే హ‌డావుడిలో డ‌బుల్ మీనింగ్ డైలాగులు వాడ‌టం ఈ మ‌ధ్య‌న క‌నిపిస్తూ ఉంటుంది. అదేమంటే హాస్యం పేరుతో బండి లాగించేస్తున్నారు. అయితే.. ఇలాంటి హాస్యం వెగ‌టు పుట్టించ‌ట‌మే కాదు.. లేనిపోని త‌ల‌నొప్పుల‌కు కార‌ణ‌మ‌న్నట్లుగా మారింది. సోష‌ల్ మీడియా యాక్టివ్ గా ఉన్న ఈ రోజుల్లో నోటి నుంచి వ‌చ్చే మాట‌లో ఏ మాత్రం తేడా వ‌చ్చినా మొద‌టికే మోసం వ‌చ్చేయ‌టం.. పెద్ద వివాదంగా మారుతున్న ప‌రిస్థితి.

తాజాగా అలాంటి సీనే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో వేడుక‌లో చోటు చేసుకుంది. ఈ ఆడియో వేడుక సంద‌ర్భంగా అమ్మాయిలు మ‌న‌శ్శాంతికి హానిక‌రంం అంటూ యాంక‌ర్ ర‌వి.. తోటి మ‌హిళా యాంక‌ర్ లు సీనియ‌ర్ న‌టులు చ‌ల‌ప‌తిరావును ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న నోరు జారి చేసిన వ్యాఖ్య‌లు అక్క‌డున్న వారికి షాకింగ్ గా మారాయి.

త‌ర్వాతి రోజున సోష‌ల్ మీడియాలో ఈ వ్య‌వ‌హారం తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయి. చివ‌ర‌కు ఆయ‌న‌పై కేసులు పెట్టే వ‌ర‌కూ వెళ్లింది.

ఈ నేప‌థ్యంలో ఫేస్ బుక్ లైవ్‌లోకి వ‌చ్చేశారు చ‌ల‌ప‌తిరావు. నారీ లోకానికి న‌మ‌స్కార‌మంటూ ఫేస్ బుక్ లైవ్‌ ను మొద‌లెట్టిన ఆయ‌న‌.. త‌న వ్యాఖ్య‌ల‌కు డ‌బుల్ మీనింగ్ తీసుకున్నారంటూ త‌న వ్యాఖ్య‌ల్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌కు మ‌హిళ‌లంటే గౌర‌వం ఉంద‌ని.. మ‌హిళ‌ల ప‌ట్ల అవ‌మాన‌కరంగా యాకంర్ ప్ర‌శ్న‌కు చాలా నిజాయితీతో కోపంగా మాట్లాడానే త‌ప్ప ఇంకేమీ లేద‌న్నారు. ఆడ‌వాళ్లు హానిక‌రం అని అడ‌గొచ్చా? అంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న అలా అన్న వారిని ఒక్క మగాడు కానీ ఒక మ‌హిళ కానీ ఖండించ‌లేద‌ని.. అందుకే తాను అలా మాట్లాడాన‌న్నారు. మ‌హిళ‌లు హ‌ర్ట్ అయి ఉంటే సారీ అని.. అలా అని తానేమీ బెదిరిపోన‌ని.. తాను చాలా గ‌ట్టివాడినంటూ వ్యాఖ్యానించటం గ‌మ‌నార్హం.

త‌న విజ‌యం వెనుక కూడా త‌న భార్య ఉంద‌ని.. అప్పుడెప్పుడో 40 ఏళ్ల క్రితం త‌న భార్య చ‌నిపోతే మ‌ళ్లీ పెళ్లి చేసుకోకుండా.. మ‌రో మ‌హిళ వైపు చూడ‌కుండా సంసారాన్ని దిద్దుకొచ్చాన‌ని డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్ర‌య‌త్నం చేశారు చ‌ల‌ప‌తిరావు. చివ‌ర్లో జై మ‌హిళా లోకం అంటూ ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ ఉరిమి ఉరిమి మంగ‌ళం మీద ప‌డిన‌ట్లు.. నోరు జారేసి.. దానికి కార‌ణం యాంక‌ర్లు అంటూ వారిని బ‌లిప‌శువులు చేయ‌టం ఏమిటి? ఒక‌వేళ త‌ప్పుగా ప్ర‌శ్న వేశార‌ని అనుకుందాం.. దానికి హుందాగా స‌మాధానం చెబితే స‌రిపోయే దానికి మంట పుట్టి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌టం ఏమిటి? నోరు జారాన‌ని ఒప్పుకోకుండా క‌వ‌రింగ్ తో చేసే వ్యాఖ్య‌లు మ‌రిన్ని ఇబ్బందులు క‌లిగిస్తాయే త‌ప్పించి మ‌రొక‌టి ఉండ‌ద‌న్న విష‌యాన్ని చ‌ల‌ప‌తిరావు ఎప్ప‌టికి అర్థం చేసుకుంటారో?


Tags:    

Similar News