ఏపీ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపిన డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్..!

Update: 2021-12-30 11:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సీజ్ చేసిన సినిమా థియేటర్లను తిరిగి ఒపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గురువారం ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

ఏపీలో గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు థియేటర్లపై తనిఖీలు జరిగాయి. నిబంధనలు పాటించని థియేటర్లకు అధికారులు నోటీసులు జారీ చేసి.. సీజ్ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో 83 థియేటర్స్ మూత పడ్డాయి. మరోవైపు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లతో సినిమాలు ప్రదర్శించలేమంటూ మరికొందరు యజమానులు స్వచ్చందంగా సినిమా హాళ్లను మూసి వేశారు.

దీంతో ఇటీవల పలువురు డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబిటర్స్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మిస్టర్ మంత్రి పేర్ని నానితో సమావేశమై.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు థియేటర్లకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. థియేటర్స్ రీ ఓపెనింగ్ కి అనుమతినిచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు మంత్రి పేర్ని నానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

అలానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మిగతా విన్నపాల పట్ల కూడా సానుకూలంగా స్పందన వస్తుందని తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, థియేటర్లు తెరుచుకోడానికి అనుమతి ఇచ్చిన ఏపీ సర్కారు.. అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు సరిదిద్దుకోవాలని సూచించింది.

ఇందుకుగాను నెల రోజుల సమయం ఇచ్చింది. అప్పటిలోగా థియేటర్ల నిర్వహణకు కావలసిన కనీస సేఫ్టీ లైసెన్స్ తో పాటు అవసరమైన అనుమతులను జాయింట్ కలెక్టర్ల దగ్గర తీసుకోవాలని పేర్కొన్నారు.


Tags:    

Similar News