బన్నీ ఆ సినిమా వదులుకొని మంచి పని చేశాడా..?

Update: 2022-07-20 05:55 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పుష్ప: ది రైజ్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న బన్నీ.. బాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలోనే తన ఫాలోయింగ్ మరియు మార్కెట్ ను పెంచుకున్నాడు.

నిజానికి టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్న అల్లు అర్జున్.. పాన్ ఇండియా క్రేజ్ రావడానికి చాలా ముందుగానే ఇతర ఇండస్ట్రీలలో సత్తా చాటడానికి ప్లాన్ చేసుకున్నాడు. దీనికి తగ్గట్టుగానే కేరళలో మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు. బన్నీ ని మల్లూ అర్జున్ అని పిలుచుకుంటారు అంటేనే అతన్ని మలయాళీలు ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

అలానే తమిళ్ లో కూడా అల్లు అర్జున్ సినిమాలను మంచి ఆదరణ దక్కుతుంటుంది. ఈ నేపథ్యంలోనే నేరుగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి స్టైలిష్ స్టార్ ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. దీని కోసం పలువురు తమిళ అగ్ర దర్శకులతో సంప్రదింపులు కూడా జరిపారు. చివరికి ఎన్.లింగుస్వామి చేతుల మీదుగా కోలీవుడ్ లో లాంచ్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు.

'సరైనోడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 'డీజే - దువ్వాడ జగన్నాథం' చిత్రాన్ని ప్రారంభించాడు బన్నీ. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టిన కొన్ని రోజులకే లింగుస్వామి దర్శకత్వంలో ఓ తెలుగు తమిళ బైలింగ్విల్ మూవీ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అల్లు అర్జున్ తమిళ డెబ్యూ నిర్మాణ బాధ్యతలను స్టూడియో గ్రీన్ సంస్థ తీసుకుంది.

చెన్నైలో ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ మేరకు 2016 సెప్టెంబర్ లో బన్నీ ట్వీట్ కూడా చేసాడు. 'నన్ను తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లాంచ్ చేస్తున్న డైరెక్టర్ లింగుసామి మరియు నిర్మాత జ్ఞానవేల్ రాజాకి ధన్యవాదాలు. నాకు స్వాగతం పలికినందుకు తమిళనాడు ప్రజలకు మీడియాకు ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.

అట్టహాసంగా లాంచ్ చేయబడిన బన్నీ తమిళ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళకుండానే అటకెక్కింది. ఆర్థిక సమస్యలు మరియు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. స్క్రిప్ట్‌ పై స్పష్టత లేకపోవడంతో అల్లు అర్జున్ వెనక్కి తగ్గాడు.

ఇక 'డీజే' తర్వాత వక్కంతం వంశీని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ 'నా పేరు సూర్య' అనే సినిమా చేసాడు. ఇది ప్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన 'అల వైకుంఠపురములో' బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. 'పుష్ప' మొదటి భాగం బన్నీ ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది.

మరోవైపు అల్లు అర్జున్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో దర్శకుడు లింగుస్వామికి చాలా గ్యాప్ వచ్చింది. పలువురు టాలీవుడ్ స్టార్స్ తో సినిమాలు చేయడానికి గట్టిగా ట్రై చేసాడు కానీ ఏదీ వర్కవుట్ అవ్వలేదు. దీంతో మళ్లీ సొంత ఇండస్ట్రీకే వెళ్లి రెండేళ్ల తర్వాత 'పందెంకోడి 2' సినిమాతో వచ్చాడు.

ఈ మూవీ ప్లాప్ అవ్వడంతో దర్శకుడికి ఈసారి కూడా నాలుగేళ్ళ విరామం వచ్చింది. ఎట్టకేలకు టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తో ప్రాజెక్ట్ సెట్ చేసుకుని.. ఉస్తాద్ ని కోలీవుడ్ లో లాంచ్ చేసే బాధ్యత తీసుకున్నాడు. ఈ విధంగా 'ది వారియర్' సినిమా కార్యరూపం దాల్చింది.

అయితే థియేటర్లలో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ దిశగా పయనిస్తోంది. ఫస్ట్ వీకెండ్ లో పర్వాలేదనిపించినా.. సాధారణ రోజుల్లో ప్రభావం చూపలేకపోయింది. తమిళ మార్కెట్‌ లో సత్తా చాటాలన్న రాపో ప్లాన్స్ వర్కవుట్ కాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో లింగుస్వామి తో అల్లు అర్జున్ అప్పట్లో ద్విభాషా చిత్రం చేసి ఉంటే హీరో కెరీర్ ఎలా ఉండేదో అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

బన్నీ కి చెప్పిన కథనే మార్పులు చేర్పులతో చేశాడేమో తెలియదు కానీ.. రామ్ జడ్జిమెంట్ తప్పు అని తేలిందని అంటున్నారు. లింగుస్వామి ప్రాజెక్ట్ విషయంలో అల్లు అర్జున్ సరైన నిర్ణయం తీసుకున్నారని.. ఒకవేళ ఆ సినిమా చేసుంటే ఎలా ఉండేదే అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
Tags:    

Similar News