గ‌ల్లీ రౌడీ.. ఇంత పిసినారిత‌న‌మా?

Update: 2021-09-18 23:30 GMT
దూకుడు సినిమాను త‌న కెరీర్లో చాలా స్పెష‌ల్ ఫిలింగా చెప్పుకుంటూ ఉంటాడు స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్. ఆ సినిమాలో కామెడీ సీన్లు ఏ రేంజిలో పేలాయో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఎన్నో సినిమాల్లో స్పూఫ్‌ల‌కు, సోష‌ల్ మీడియాలో మీమ్స్‌కు ఈ సినిమాలో స‌న్నివేశాలు ప‌నికొచ్చాయి. ఐతే కోన వెంక‌ట్ సైతం త‌న స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన కొత్త చిత్రం గ‌ల్లీ రౌడీ కోసం దూకుడు సినిమాను ఉప‌యోగించుకున్నాడు. కానీ అది మ‌రీ సిల్లీగా త‌యారై సినిమాకు ప్ర‌తికూలంగా మారింది.

గ‌ల్లీ రౌడీ సినిమాలో హీరో సందీప్ కిష‌న్ తండ్రి పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్‌ను చూపించారు. ఐతే ఈ సినిమాలో ఆయ‌న న‌టించిన స‌న్నివేశాలేమీ క‌నిపించ‌దు. నేరుగా ప్ర‌కాష్ రాజ్ చ‌నిపోయిన‌ట్లు చూపిస్తారు. ఫొటోలో మాత్ర‌మే ఆయ‌న క‌నిపిస్తారు. ఇలా ఫొటోల వాడ‌కం కొత్తేమీ కాదు కానీ.. ఇక్క‌డ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి దూకుడు సినిమాలో ప్ర‌కాష్ రాజ్ కారును లారీతో గుద్దించేసే సీన్ కూడా వాడేసుకున్నారు. ఊరికే మాట‌ల రూపంలో యాక్సిడెంట్ అని చెబితే స‌రిపోతుంది కానీ.. అవ‌స‌రం లేకుండా అక్క‌డ యాక్సిడెంట్ సీన్ చూపించారు.

ప్ర‌కాష్ రాజ్ కనిపించాల్సిన అవ‌స‌రం లేన‌పుడు ఏదో ఒక యాక్సిడెంట్ షాట్ అయినా తీసుకుని ఉండాల్సింది. కానీ మ‌రీ పిసినారి త‌నం ప్ర‌ద‌ర్శిస్తూ దూకుడు సినిమాలో స‌న్నివేశాన్ని లేపుకొచ్చి పెట్టేశారు. ఆ సినిమాకు రైట‌ర్ కోన‌నే కాబ‌ట్టి స్వేచ్ఛ తీసుకున్నారేమో కానీ.. ఇలా వేరే సినిమాలో స‌న్నివేశం క‌నిపించాక తండ్రి చావుకు హీరో ప్ర‌తీకారం తీర్చుకున్న‌ట్లు చూపించ‌డంతోనే క్లైమాక్స్‌ మ‌రీ సిల్లీగా త‌యారైంది. ఈ విష‌యంలో ఎమోష‌న్ ఏమాత్రం క్యారీ అవ్వ‌లేదు. ఇదొక‌ట‌నే కాదు.. గ‌ల్లీ రౌడీలో సిల్లీ సీన్లు బోలెడు.
Tags:    

Similar News