ముందు డీజీ కానియ్ శంకరా

Update: 2017-05-22 09:01 GMT
‘బాహుబలి’ హిట్ ప్రభావం తెలుగు సినీ జనాలకు బాగానే వంటపట్టినట్టుంది. బాహుబలి భారీ ప్రాజెక్ట్ కావడంతో రెండు పార్టులుగా తీయడం నిర్మాతలకు బాగా కలిసొచ్చింది. దీంతో  హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీస్తే ఎలా ఉంటుందా అని కొందరు తెగ ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో హరీష్ శంకర్ అందరికన్నా ఒకడుగు ముందే ఉన్నాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా తీస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా రెండో పార్ట్ తీయాలని రెడీ అయిపోతున్నాడని తాజా సమాచారం. ఈ మేరకు కాన్సెప్ట్ రెడీ చేసుకుని హీరో అల్లు అర్జున్ కు ఆల్రెడీ వినిపించి సరే అనిపించుకున్నాడట. దువ్వాడ జగన్నాథమ్ సినిమా పూర్తయ్యాక సెకండ్ పార్ట్ స్ర్కిప్ట్ వర్క్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడనేది సమాచారం.

అచ్చమైన బ్రాహ్మణ యువకుడిగా నుదుటన విభూతి బొట్టు.. పంచెకట్టు గెటప్ తో టీజర్ రిలీజ్ నుంచి దువ్వాడ జగన్నాథమ్ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో బజ్ మొదలైంది. అల్లు అర్జున్ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానులు ఉంటారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందా అని ఫ్యాన్స్ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే షూటింగ్ మాత్రం ఓ పట్టాన పూర్తవడం లేదు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. ఒకలైలా కోసం ఫేం పూజాహెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

ముందస్తుగా అనుకున్న దాని ప్రకారమైతే ఈ సమ్మర్ కే దువ్వాడ జగన్నాథమ్ థియేటర్లకు వచ్చేయాలి. కానీ ఇంతవరకు షూటింగే కొలిక్కిరాలేదు. జూన్ 23 నాటికి సినిమా రిలీజ్ చేయాలని తంటాలు పడుతున్నాడు. ముందు ఈ సినిమా పూర్తి చేసి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంటే అప్పుడు రెండో పార్ట్ గురించి తాపీగా ఆలోచించొచ్చు. ఏమంటావ్ హరీష్ శంకరా..
Tags:    

Similar News