సోష‌ల్ మీడియా అతి పై ఆవిడ‌లో కంగారు!

Update: 2019-11-26 07:59 GMT
సామాజిక మాధ్య‌మాల వెల్లువపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ డిజిట‌ల్ యుగంలో సామాన్యులైనా సెల‌బ్రిటీలు అయిపోవ‌చ్చు. సెల‌బ్రిటీలు త‌మ స్థాయిని పెంచుకోవ‌చ్చు. లేదూ ఈ వేదిక సాక్షిగా ప‌రువు పీకి పందిరి వేయ‌నూ వ‌చ్చు. ఆత్మ‌హ‌త్య‌లు.. డిప్రెష‌న్.. ఇలాంటి ప్ర‌మాదాలు కూడా వెంట‌ప‌డి రావొచ్చు. ట్విట్ట‌ర్.. ఫేస్ బుక్ వేదిక‌ల‌పై మంచి కంటే చెడు పెట్రేగుతోంద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.

అయితే దీని పై సీనియ‌ర్ న‌టి ర‌వీనాటాండ‌న్ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. మా కాలంలో (90ల‌లో) సోష‌ల్ మీడియా లేక‌పోవ‌డం ఒక ర‌కంగా మైన‌స్ అని అనుకుంటే.. మ‌రో కోణంలో బ‌తికిపోయాం! అనే అర్థంలో ర‌వీనా మాట్లాడారు. సోష‌ల్ మీడియా వ‌ల్ల బోలెడంత ఫోక‌స్ వ‌స్తోంది అని అభిప్రాయం వ్య‌క్త‌ప‌రిచినా.. మా రోజుల్లో ఇది ఉండి ఉంటే నా ప‌రిస్థితి ఏమ‌య్యేదో.. నేను చాలా మందితో గొడ‌వ ప‌డేదానినేమో! అంటూ ఆందోళ‌న కూడా వ్య‌క్త‌పరిచారు. ఈ మాధ్య‌మంలో చెడు ఎక్కువ‌గా పాపుల‌ర‌వుతోంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

ర‌వీనాటాండ‌న్ 90ల‌లో అగ్ర క‌థానాయిక‌గా వెలిగిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లోనే న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న బంగారు బుల్లోడు అనే బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంలో న‌టించిన ర‌వీనా టాండ‌న్ ఆ త‌ర్వాత హిందీలో అగ్ర క‌థానాయిక‌గా కొన‌సాగారు. పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు టీవీ షోలు అంటూ బిజీబిజీగా ఉన్నారు. ది ల‌వ్ లాఫ్ లైవ్ షో కార్య‌క్ర‌మంలో సోష‌ల్ మీడియా ప‌ర్య‌వ‌సానంపై ర‌వీనా త‌న అభిప్రాయాల్ని కుండ‌ బ‌ద్ధ‌లు కొట్టారు. ఈ వేదిక‌పై మంచి కంటే చెడు ప‌ర్య‌వ‌సానాలే ఎక్కువ కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని అన్నారు. ఇక ర‌వీనాటాండ‌న్ కెరీర్ మాంచి ఊపులో ఉన్న‌ప్పుడు అక్ష‌య్ కుమార్ తో ప్రేమాయ‌ణం న‌డిపించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో మామూలు మీడియానే ఈ సంగ‌తిని ఊద‌ర‌ గొట్టేసింది. ఇప్పుడు ఉన్న‌ట్టు సోష‌ల్ మీడియా ఉంటే ఎలా ఉండేదో స‌న్నివేశం? పెళ్లి త‌ర్వాత‌ చాలా గ్యాప్ అనంత‌రం అమితాబ్ ప్ర‌ధాన పాత్ర‌లో పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `బుడ్డా హోగా తేరా బాప్` అనే చిత్రంలో ర‌వీనా న‌టించారు. ఈ అందాల న‌టికి సోష‌ల్ మీడియాల్లో దాదాపు 35ల‌క్ష‌ల మంది ఫ్యాన్ ఫాలోవ‌ర్స్ ఉండ‌డం ఓ రికార్డ్ అనే చెప్పాలి.

Tags:    

Similar News