సినిమా ప్రచార చిత్రాల ద్వార వాటి కథ ఏంటన్నది కొంతవరకూ తెలుస్తుంది. కానీ దర్శకుడు క్రిష్ నేడు విడుదల చేసిన ట్రైలర్ ద్వారా కంచె కథ తెలియాలంటే అక్టోబర్ 2న థియేటర్ లో చూడమని చెప్పకనే చెప్పాడు. ఇదివరకు విడుదల చేసిన టీజర్ లోనూ అంతే. సినిమా నేపథ్యం తప్పితే కథ ఇది అని ఖచ్చితంగా చెప్పలేదు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ప్రేమలో వ్యతిరేకత వుంటే అది మరింత బలపడుతుంది. కథ రసవత్తరంగా వుంటుంది. చూస్తుంటే ముక్కోణపు ప్రేమకథలా ఆసక్తి కలిగించేలా వుంది. వరుణ్ సైనికుడి లుక్ ఇదివరకే ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అలనాటి అచ్చ తెలుగు ఆడపడుచులా లంగావోణీలొ అందంగా వుంది. యుద్ధ సన్నివేశాలు అరవీర భీకరంగా వున్నాయి. సాయి మాధవ్ సంభాషణలు మునిపటిలా బలంగా వున్నా సినిమా చూసినపుడే వాటి గాడత అర్థమయ్యేలా వున్నాయి. ప్రేమంటే యుద్ధం అని చెబుతున్న ఈ సినిమాలో ఆ యుద్ధానికి గల కారణం, జరిగిన తీరు, ఫలితం.. దాని పర్యవాసనం అన్నీ బోధపడేది అక్టోబర్ 2నే. ఓవరాల్ గా క్రిష్ మార్క్ సినిమా అనేది సుస్పష్టం. అన్నట్టు ఈ ట్రైలర్ విడుదల చేసింది మన దర్శకధీరుడు రాజమౌళే. ఆయన చేతుల్లోని అదృష్టం ఈ సినిమాకి ఎంతవరకు వచ్చిందో మరో నెలరోజుల్లో తెలిసిపోతుంది.